భారత తొలి మిస్ ఇండియా మెహర్ కాస్టలినో కన్నుమూత | ఫ్యాషన్ రంగానికి తీరని లోటు

భారత ఫ్యాషన్ రంగానికి పునాదులు వేసిన ప్రముఖురాలు, దేశ తొలి మిస్ ఇండియా, ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో (81) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారత ఫ్యాషన్ జర్నలిజం ఒక మార్గదర్శకురాలిని కోల్పోయింది. ఆమెకు కుమారుడు కార్ల్, కోడలు నిషా, కుమార్తె క్రిస్టినా ఉన్నారు.

ముంబైలో జన్మించిన మెహర్ కాస్టలినో, 1964లో ‘ఫెమినా మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె పేరు భారత అందాల పోటీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆ తరువాత మిస్ యూనివర్స్, మిస్ యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొని భారతదేశానికి గౌరవప్రతినిధిగా నిలిచారు.

మోడలింగ్ ప్రపంచంలో తనదైన గుర్తింపు సాధించిన అనంతరం ఆమె ఫ్యాషన్ జర్నలిజం వైపు అడుగులు వేశారు. 1973లో ‘ఈవ్స్ వీక్లీ’ పత్రికలో తొలి కథనంతో జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మెహర్, అనతి కాలంలోనే ఫ్యాషన్ కాలమిస్టుగా విశేష గుర్తింపు సంపాదించారు. దాదాపు 160కు పైగా జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లలో ఆమె రచనలు ప్రచురితమయ్యాయి. ఫ్యాషన్ రంగంలోని మార్పులు, ధోరణులను లోతుగా విశ్లేషించిన ఆమె రచనలు పాఠకుల విశేష ఆదరణ పొందాయి. ‘మ్యాన్‌స్టైల్’, ‘ఫ్యాషన్ కెలిడోస్కోప్’ వంటి పుస్తకాల ద్వారా కూడా ఫ్యాషన్ పై తన అనుభవాన్ని, అవగాహనను పంచుకున్నారు.

భారతదేశంలో ఫ్యాషన్ జర్నలిజాన్ని ఒక ప్రత్యేక విభాగంగా నిలబెట్టడంలో మెహర్ కాస్టలినో పాత్ర కీలకమైనదిగా భావిస్తారు. లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి అనేక ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ ఈవెంట్లకు అధికారిక ఫ్యాషన్ రైటర్‌గా పనిచేశారు. ఫ్యాషన్‌ను కేవలం సెలబ్రిటీ గ్లామర్‌గా కాకుండా, ఒక సమగ్ర పరిశ్రమగా విశ్లేషించిన తొలితరం జర్నలిస్టులలో ఆమె ఒకరు.

యువ డిజైనర్లు, కొత్త రచయితలను ప్రోత్సహించడంలో ముందుండిన మెహర్, పలు ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో జడ్జిగా, స్పీకర్‌గా సేవలందించారు. ఆమె సూచనలు, విమర్శలు అనేకమందికి దిశానిర్దేశకంగా నిలిచాయి. మెహర్ కాస్టలినో మరణంతో భారత ఫ్యాషన్ రంగం, జర్నలిజం ఒక విశిష్టమైన, ప్రేరణాత్మక వ్యక్తిత్వాన్ని కోల్పోయింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి