మీడియా విలువల పతనం: లోగోలు, అక్రిడేషన్‌ల వ్యాపారంగా మారిన జర్నలిజం

జర్నలిజం అనేది కాలక్రమంలో అనేక రూపాల్లో విస్తరిస్తూ వచ్చింది. ఒకప్పుడు పవిత్రమైన ప్రజాసేవగా భావించబడిన ఈ వృత్తిలోకి నేడు అనేక మంది అడుగుపెడుతున్నారు. ఎవరిని అడిగినా “నేను జర్నలిస్టునే” అనే సమాధానమే వినిపిస్తోంది. అయితే, రెండు దశాబ్దాల క్రితమే జాతీయస్థాయిలో నిర్వహించిన ఓ సర్వేలో వృత్తులన్నింటిలో జర్నలిస్టు ఉద్యోగం అత్యంత క్లిష్టమైనది, తక్కువ భద్రత కలిగినదిగా గుర్తించబడిన విషయాన్ని మర్చిపోలేం. అయినప్పటికీ, కొందరు నిజాయితీ గల జర్నలిస్టులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తమ మనుగడను కొనసాగిస్తున్నారు.

ఈరోజుల్లో జర్నలిజంలోకి రావాలనే తపన కంటే, ఛానళ్ల లోగోలు చేతబట్టడం, మీడియా గుర్తింపు కార్డులు, అక్రిడేషన్ కార్డుల కోసం తాపత్రయపడడం, హోదాలు చెప్పుకోవడమే ప్రధాన లక్ష్యంగా మారింది. కానీ “మీడియా విలువలు దిగజారిపోతున్నాయే” అనే ఆలోచన చేసేవారు అరుదైపోయారు. నోరు అదుపులో పెట్టుకోకుండా, అడ్డదిడ్డంగా మాట్లాడే వ్యక్తులకు టీవీ చానళ్లు వేదికలుగా మారుతున్నాయి. రాజకీయ నాయకుల చుట్టూ “నా లోగో–నా లోగో” అంటూ పోటీ పడుతూ, అవతలివారు ఏమి మాట్లాడుతున్నారో కూడా గ్రహించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని పర్యవసానం ఏమిటి? ఇది ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలకు ఛానల్ యాజమాన్యాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

జర్నలిజం అనేది ఉద్యోగం కంటే ముందుగా సమాజసేవ. ఇది ఒక వాస్తవం. అయితే నేటి మీడియా సంస్థలు నిజంగా ఎంత మేరకు సమాజసేవ చేస్తున్నాయి? ప్రకటనల పేరుతో జర్నలిస్టులపై లక్షల రూపాయల టార్గెట్లు మోపి, ఆ టార్గెట్ల కోసం చచ్చి చెడి పనిచేయిస్తున్నప్పుడు దీన్ని ఏమనాలి? అటువంటి పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు కనీస గౌరవ వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదు? దీనిపై ప్రశ్నించని జర్నలిస్టు సంఘాలు ఎందుకు? సంఘాల పేరుతో నాయకత్వం వహిస్తున్న వారు జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడలేకపోతే, అటువంటి నాయకత్వం వల్ల జర్నలిజానికి ఉపయోగం ఏమిటి?

మీడియా అంటే సంఘసేవ అని బోధించే కొన్ని సంస్థలే లోగోలు, ప్రెస్ ఐడీ కార్డులను విక్రయిస్తే, దాన్ని సంఘసేవగా ఎలా పరిగణించాలి? నేటి పరిస్థితుల్లో మీడియా సామాజిక బాధ్యత కాదు, ఉద్యోగం కూడా కాదు అన్నట్లుగా మారింది. సమాజాన్ని దోచుకోవడం, నాశనం చేయడమే కొందరి మీడియా పాత్రగా మారిందన్న విమర్శ తప్పించుకోలేనిది.

వేల రూపాయలు ఖర్చుచేసి మీడియా గుర్తింపు కార్డులు, అక్రిడేషన్ కార్డులు, ఛానల్ లోగోలు కొనుగోలు చేసి తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకునే వారి వల్ల సమాజానికి లాభం ఏమిటి? అక్రిడేషన్ కార్డు ఉంటేనే నిజమైన జర్నలిస్టు అనే భావనలో ఉన్న పోలీసులు, అధికారులు ఒక విషయం తెలుసుకోవాలి. కొన్ని మీడియా సంస్థలు అక్రిడేషన్ కార్డులను ఐదు వేలు, పది వేలు నుంచి లక్ష రూపాయల లోపు బేరసారాలతో అమ్ముతున్నాయి. ఈ శక్తుల నుంచి జర్నలిజాన్ని కాపాడాల్సిన అవసరం అత్యవసరం.

మీడియా అక్రిడేషన్ కార్డుల వల్ల ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయా? సమాధానం స్పష్టంగా “లేదు”. సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు జర్నలిజం మూలాలను కాపాడుతూ వచ్చిన సీనియర్ జర్నలిస్టుల ముందు, నేటి కొందరు వాట్సాప్ జర్నలిస్టుల తీరు “పిల్ల వచ్చి గుడ్డును వెక్కిరించినట్లు” ఉంది. ఫలితంగా అనుభవజ్ఞులు, తలలు పండిన జర్నలిస్టులు పక్కకు నెట్టబడుతున్నారు.

ఒకప్పుడు అన్ని రంగాలపై కనీస అవగాహన ఉన్నవారే జర్నలిస్టులుగా గుర్తింపొందేవారు. నేడు మాత్రం తన పేరును సరిగ్గా రాయలేని వారు కూడా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. అక్షరజ్ఞానం లేని కొందరు ఒకటికి రెండు, రెండుకు మూడు అంటూ క్రాస్ మీడియా అధినేతలుగా మారిపోయారు. ఇదేనా మనం కాపాడుకోవాలనుకున్న జర్నలిజం? ఇదేనా తెలుగు జర్నలిజం భవిష్యత్?
ఈ ప్రశ్నలకు సమాధానం వెతకకపోతే, జర్నలిజం అనే వృత్తి తన అసలైన ఆత్మను పూర్తిగా కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి