డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు మానవత్వాన్నే మరిచి, మూగజీవాలపై అమానుష హింసకు పాల్పడుతున్నారు. జంతువుల రక్తంతో అక్రమ వ్యాపారం సాగిస్తున్న ఓ ముఠాను మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పోలీసులు గుట్టు రట్టు చేశారు. వైద్య వృత్తి ముసుగులో ఓ నకిలీ పశువైద్యుడు సాగిస్తున్న ఈ దారుణ దందా వివరాలు అధికారులనే కాదు, ప్రజలను కూడా విస్తుపోయేలా చేస్తున్నాయి.
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక మటన్ షాప్ యజమాని, ఓ నకిలీ వెటర్నరీ డాక్టర్‌తో కలిసి గొర్రెలు, మేకలను లక్ష్యంగా చేసుకుని ఈ దందాను నిర్వహిస్తున్నాడు. ఎలాంటి మత్తుమందు లేకుండానే, సూదులతో అత్యంత క్రూరంగా జంతువుల శరీరం నుంచి రక్తాన్ని పీల్చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. రక్తమే కాకుండా, దానిలో నుంచి ప్లేట్‌లెట్లను వేరు చేసి ప్రత్యేక ప్యాకెట్లలో నిల్వ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ కేంద్రంపై మెరుపు దాడి చేసి, అక్కడి నుంచి 180 రక్తపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అడ్డగోలుగా రక్తాన్ని తీసిన కారణంగా జంతువులు తీవ్ర రక్తహీనతకు గురై, ఒకటి రెండు రోజుల్లోనే మృత్యువాత పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. లాభాల కోసం బతికున్న జంతువులను ఇంత కర్కశంగా హింసించడం చట్టరీత్యా ఘోర నేరమని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జంతువుల రక్తం, దాని నుంచి తీసిన ప్లేట్‌లెట్లు కొన్ని రకాల వ్యాధులకు మందులని నమ్మిస్తూ, ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తేలింది. అయితే జంతువుల రక్తం తాగితే వ్యాధులు నయమవుతాయన్న వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలతో ప్రజలు తమ ప్రాణాలను ప్రమాదంలో పడవేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటనలో మటన్ షాప్ యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జంతు హింస నిరోధక చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ దందా వెనుక మరెవరైనా ఉన్నారా? ఇతర ప్రాంతాలకు ఈ నెట్‌వర్క్ విస్తరించిందా? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.



