Markapuram: బొమ్మలాపురం గ్రామంలో పెద్దపులి సంచారం.. రైతులు, పశువుల కాపరులకు ప్రాణభయం

మార్కాపురం జిల్లాలోని దోర్నాల మండలం బొమ్మలాపురం సమీప ప్రాంతాల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా క్షణక్షణం భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల దేవలూటి వద్ద మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది.

ఆవుల మందపై దాడి.. కాపరిపైకి దూసుకొచ్చిన పులి

దేవలూటి ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేయగా, ఒక ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనను గమనించిన పశువుల కాపరి కేకలు వేయడంతో పులి ఆవును వదిలి ఒక్కసారిగా కాపరి వైపు దూసుకొచ్చింది. వెంటనే అక్కడున్నవారు కర్రలతో బెదిరించడంతో పులి అక్కడి నుంచి అడవిలోకి జారుకుంది. ఈ సంఘటన స్థానికులను మరింత భయాందోళనలకు గురి చేసింది.

రైతులు, పశువుల కాపరులకు ప్రాణభయం

గ్రామానికి సమీపంలోని పొలాల వద్ద పెద్దపులి సంచరిస్తుండటంతో రాత్రి వేళ పంటలకు కాపలా వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లడానికీ భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పులి అడుగుల జాడలు పొలాలకు వెళ్లే దారుల్లో కనిపిస్తుండటంతో రైతులు ప్రాణభయంతో వెనక్కి తగ్గుతున్నారు.

ఇదే తొలిసారి కాదు

బొమ్మలాపురం ప్రాంతంలో పెద్దపులి దాడులు ఇది మొదటిసారి కాదని గ్రామస్తులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలోని తుంగుడు సమీపంలో ఆవుల మందపై పులి దాడి చేసి ఒక కోడె దూడను చంపిన ఘటన చోటుచేసుకుంది. అప్పటినుంచి గండి చెరువు, తుంగుడు ప్రాంతాల్లో పదే పదే పెద్దపులి సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తోందని ఆరోపిస్తున్నారు.

గండిచెరువుకు నీటి కోసం పులి రాకపోకలు

గ్రామానికి సమీపంలోని అటవీ సరిహద్దుల్లో ఉన్న గండిచెరువు వద్దకు నీరు తాగేందుకు పెద్దపులి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా ఈ ప్రాంతంలో పులి కదలికలు ఉన్నాయని పశువుల కాపరులు పేర్కొంటున్నారు. పాదముద్రల ఆధారంగా ఇది ఆడపులి కావచ్చని అటవీ శాఖ అధికారులు గతంలో అంచనా వేశారు.

కెమెరా ట్రాప్స్ ఉన్నా పట్టుబడని కదలికలు

పులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు గతంలో చెట్లకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే కొన్నిసార్లు పులి కదలికలు కెమెరాలకు చిక్కడం లేదని తెలుస్తోంది. తాజాగా మరోసారి ఇదే ప్రాంతంలో పశువులపై దాడి జరగడంతో గ్రామస్తుల భయం మరింత పెరిగింది.

అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

పులి ఎక్కువగా రాత్రి వేళల్లో సంచరిస్తోందని, అడవి దాటి పొలాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు, పశువుల కాపరులు కోరుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో పశువులు పులిదాడిలో చనిపోయాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి