మావోయిస్టు పార్టీలో నమ్మకద్రోహులు ఉన్నారు – మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న సంచలన వ్యాఖ్యలు

మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు, నమ్మకద్రోహులు ఉన్నారని మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు పల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బసవరాజు ఎన్‌కౌంటర్ వెనుక నిజానికి కోవర్ట్ ఆపరేషన్ జరిగిందని ఆయన వెల్లడించారు. సుమారు 45 ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడిపిన చంద్రన్న, ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు భద్రతా వర్గాలు, రాజకీయ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారాయి.

చంద్రన్న మాట్లాడుతూ, ప్రభుత్వ ‘ఆపరేషన్ కగార్‌’తో మావోయిస్టు ఉద్యమానికి కొంత నష్టం జరిగినప్పటికీ, పార్టీని పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. “మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తాం” అన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన వాస్తవానికి దూరంగా ఉంది అని ఆయన అన్నారు. తాను స్వచ్ఛందంగా లొంగిపోలేదని, ఆరోగ్య సమస్యల కారణంగానే అజ్ఞాతం వీడానని స్పష్టం చేశారు. “నేను ఇంకా నా సిద్ధాంతాలను వదల్లేదు” అని ఆయన తెలిపారు.

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్‌కు చెందిన చంద్రన్న, 1979లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) ద్వారా ఉద్యమ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో కిషన్‌జీ అనుచరుడిగా దండకారణ్యంలో అడుగుపెట్టి, 1981లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అనంతరం వివిధ స్థాయిల్లో ఎదిగి, 2024 నాటికి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గదర్శకుడిగా కొనసాగారు.

ఇటీవలి సంవత్సరాల్లో మోకాళ్ల వ్యాధి తీవ్రత, ఆరోగ్యం క్షీణించడం, భద్రతా దళాల ఒత్తిడి, పార్టీ నాయకత్వంతో సిద్ధాంతపరమైన విభేదాలు — ఇవన్నీ కలసి ఆయనను లొంగిపోవడానికి దారి తీసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. అయితే, చంద్రన్న చేసిన కోవర్ట్ ఆపరేషన్ ఆరోపణలు మరియు పార్టీ అంతర్గత ద్రోహాలపై చేసిన వ్యాఖ్యలు మావోయిస్టు వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి