తమ లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టు పార్టీ చేసిన ఆరోపణలకు రూపేశ్ అలియాస్ సతీశ్ అలియాస్ ఆశన్న స్పందించారు. తాము మావోయిస్టు పార్టీలో కోవర్టులుగా పనిచేశారన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ, “ప్రజాస్వామ్యవాదులు, పౌరహక్కుల సంఘం నేతలు తమ పరిధి దాటి మాట్లాడుతున్నారు. లోపల పరిస్థితులు మీకు తెలియవు,” అని వ్యాఖ్యానించారు.
ఆశన్న తెలిపిన ప్రకారం, సాయుధపోరాట విరమణ నిర్ణయం పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు (బస్వరాజ్ దాదా) జీవించి ఉన్నప్పుడే తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు. “ఈ నిర్ణయం వెనుక ఎలాంటి స్వార్థం లేదు. త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం,” అని పేర్కొన్నారు.
“మావోయిస్టు పార్టీ ఆరోపణలు తప్పుడు”
తాజాగా మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలను “విప్లవ ద్రోహులు”గా అభివర్ణించిన నేపథ్యంలో ఆశన్న ఒక వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చారు.
“మావోయిస్టు పార్టీకి ఎవరు బయటకు వచ్చినా వారిని ద్రోహులుగానే పిలిచే సంప్రదాయం ఉంది. కానీ ఈసారి కోవర్టులుగా పనిచేశారన్న ఆరోపణలు రావడంతో నిజం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది,” అని అన్నారు.
ఆయన వివరించిన ప్రకారం, అడవులను విడిచిపెట్టే నిర్ణయం రెండు మార్గాల్లో చర్చించబడిందట—శాంతి చర్చల రూపంలోనా లేక సాయుధపోరాట విరమణ రూపంలోనా. వీటిలో రెండో మార్గాన్నే ఎంచుకున్నామని తెలిపారు. ఈ చర్చలు నంబాళ్ల కేశవరావు సజీవంగా ఉన్న ఏప్రిల్–మే నెలల్లో జరిగాయని, ఆయన మరణానంతరం కొందరు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.
“నంబాళ్ల లేఖ బయటకు రాకపోవడం అనుమానాస్పదం”
“మాతో పాటు బయటకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే బయటకు వచ్చారు. ఎవరినీ బలవంతం చేయలేదు. ఇది సీసీ నాయకత్వానికి తెలిసిన నిర్ణయమే,” అని ఆశన్న తెలిపారు.
అయితే నంబాళ్ల కేశవరావు తన చివరి లేఖను మే 13న పంపించిన తర్వాత కొద్ది రోజుల్లో ఎన్కౌంటర్ జరగడంతో, ఆ లేఖ ఇంకా బయటకు రాకపోవడం పట్ల ఆయన సందేహం వ్యక్తం చేశారు.
“ప్రధాన కార్యదర్శి రాసిన లేఖను కొందరు చదివి మిగతా సీసీ సభ్యులకు అందించలేదు. ఆ లేఖలో దాదా ఏం రాశారో ఇప్పటికీ బయటకు రాలేదు. ఆయన సాయుధపోరాట విరమణనే సరైన దిశగా భావించారని ఆ లేఖలో స్పష్టంగా ఉంది,” అని ఆశన్న తెలిపారు.
“మాలో విప్లవతత్వం ఇంకా జీవిస్తుంది”
ఆశన్న మాట్లాడుతూ, “మాలో విప్లవతత్వం ఇంకా మిగిలే ఉంది. మేము పూర్తిగా దిగజారిపోయిన వారు కాదు. నంబాళ్ల కేశవరావు సజీవంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం మాత్రమే మేము ముందుకు వచ్చాం,” అని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో సాయుధపోరాటం విరమించామని చెప్పారు. “ప్రజాస్వామ్యవాదులు నిజమైన మార్గంలో మాకు సహకరిస్తే మంచిదే. లేకపోతే మేమే ముందుకు సాగుతాం,” అని అన్నారు.
“మేము చేసినది తప్పు కాదని దేశంలోని 99 శాతం మంది ప్రజలు అర్థం చేసుకున్నారు. అడవుల్లో ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ప్రజల్లో పని చేయడం మా లక్ష్యం,” అని పేర్కొన్నారు.
“మా శవాలతో ఎర్రజెండాలు ఊరేగించాలా?”
పౌరహక్కుల సంఘం, ప్రజాస్వామ్యవాదులపై ఆశన్న తీవ్ర విమర్శలు చేశారు.
“మీరు మాట్లాడేముందు నిజాలను నిర్ధారించండి. మేము అందుబాటులో ఉన్నాం కదా? నన్ను, నా సహచరులను కలుసుకుని మాట్లాడండి. హైదరాబాద్లో కూర్చున్న బుద్ధిజీవులు ఆయుధాలే విప్లవమని చెబుతున్నారు. కానీ మేము తెలంగాణవాళ్లం — మా శవాలతో ఎర్రజెండాలు ఊరేగింపులు చేయాలా?” అని ప్రశ్నించారు.
“ప్రజల పోరాటంలో మేము పాల్గొంటాం. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం తప్ప మూర్ఖంగా ప్రాణాలు కోల్పోవడం కాదు. మాలో ఇప్పటికీ విప్లవస్ఫూర్తి ఉంది. మమ్మల్ని నమ్మండి, భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం,” అని ఆశన్న స్పష్టం చేశారు.



