Manyam Dance Program: స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్.. విద్యార్థులతో కలిసి స్టెప్పులేసిన IAS

విద్యార్థులతో కలిసి స్టెప్పులేసిన టీచర్లు, IAS అధికారులు

పాఠశాల విద్యలో కొత్తదనం తీసుకొచ్చే దిశగా పార్వతీపురం మన్యం జిల్లా మరో అడుగు ముందుకేసింది. విద్యార్థుల్లో భయం, సిగ్గు, బిడియాన్ని పోగొట్టి ఆనందంతో చదువు నేర్పించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి “మన్యం డాన్స్” అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

‘ముస్తాబు’ తర్వాత మరో వినూత్న ఆలోచన

వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఆ కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. అదే స్పూర్తితో తాజాగా ‘మన్యం డాన్స్’ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు.

ప్రతి శనివారం స్కూల్‌లో డ్యాన్స్ టైమ్

ఈ కార్యక్రమం కింద జిల్లాలోని పాఠశాలల్లో ప్రతి శనివారం ఉదయం ప్రార్థన సమయంలో కొద్దిసేపు డ్యాన్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

  • పిల్లల్లో మానసిక ఉల్లాసం
  • శారీరక చురుకుదనం
  • సృజనాత్మకత, నైపుణ్యాల పెంపు
  • విద్యార్థులు–టీచర్ల మధ్య అనుబంధం

అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

స్కూల్ అంటే భయం కాదు.. హ్యాపీ ప్లేస్

‘మన్యం డాన్స్’ వల్ల స్కూల్ అంటే ఒత్తిడి అనే భావన పోయి, ఆనందంగా వచ్చే వాతావరణం ఏర్పడుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రోజంతా పిల్లలు జోష్‌తో ఉండటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులతో కలిసి స్టెప్పులేసిన IAS

ఇటీవల వీరఘట్టం మండలం తలవరం గ్రామంలోని ప్రభుత్వ ZP ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మన్యం డాన్స్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ (IAS) పాల్గొని విద్యార్థులతో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. ఏరోబిక్స్ తరహా డ్యాన్స్ చేస్తూ పిల్లలతో కలిసిపోయారు. ఆయన స్టెప్పులు చూసిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

అధికారుల భాగస్వామ్యం విద్యార్థుల్లో ఉత్సాహం

ఉపాధ్యాయులు, అధికారులు తమతో పాటు డ్యాన్స్ చేయడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని, స్కూల్ వాతావరణం ఆహ్లాదంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా ‘మన్యం డాన్స్’ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం విద్యలో ఆనందాన్ని నింపే వినూత్న ప్రయోగంగా నిలుస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి