మంగ్లీ ‘బావిలోనే బల్లి పలికే’ సాంగ్ సెన్సేషన్: చుంచు నాగవ్వ జీవన ప్రయాణం, ట్రోల్స్‌పై క్లారిటీ

చిత్ర పరిశ్రమలో ఫోక్ సింగర్‌గా తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మంగ్లీ, సినిమా పాటలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ద్వారా కూడా విస్తృతమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికే అనేక హిట్ పాటలు పాడిన ఆమె, తాజాగా విడుదల చేసిన “బావిలోనే బల్లి పలికే” పాటతో మరోసారి సంచలనం సృష్టించారు. ఈ పాటకు కమల్ స్లావత్ సాహిత్యం అందించగా, సురేష్ బబ్లీ సంగీతం సమకూర్చారు. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ సాంగ్, ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తూ ట్రెండింగ్‌గా నిలుస్తోంది.

ఈ పాట ద్వారా తన గాత్ర ప్రతిభను మరోసారి చాటుకున్నారు గాయని చుంచు నాగవ్వ. మంగ్లీతో కలిసి పాడిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్టెప్పులేస్తున్నారు. ఒక్క పాటతోనే విపరీతమైన గుర్తింపు దక్కించుకున్న నాగవ్వ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవ్వ తన జీవిత ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

జగిత్యాల జిల్లాలోని గుల్లకోట గ్రామానికి చెందిన నాగవ్వ, తన సంగీత ప్రయాణం సారంగ దరియా అనే టీవీ షోతో ప్రారంభమైందని తెలిపారు. అయితే లైవ్ పర్ఫార్మెన్స్ భయం కారణంగా మొదటి ఎపిసోడ్‌లోనే తాను ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. అయినప్పటికీ న్యాయనిర్ణేతలు తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారని, అదే పరిచయాలతో దామోదర్ రెడ్డి, మంగ్లీతో సన్నిహితంగా పని చేసే అవకాశం లభించిందని వెల్లడించారు.

“రాక్షస కావ్యం” అనే సినిమా కోసం మొదట ఈ పాటను రూపొందించామని, అయితే ఆ చిత్రంలో చోటు దక్కకపోవడంతో మంగ్లీ టీమ్ దీనిని ప్రత్యేకంగా రిలీజ్ చేసినట్లు నాగవ్వ తెలిపారు. ఈ పాట కోసం మంగ్లీ టీమ్ ఖర్చుకు వెనుకాడకుండా, పగలు రాత్రి అన్న తేడా లేకుండా మూడు రోజుల పాటు నిరంతరంగా చిత్రీకరణ జరిపినట్లు వివరించారు.

అలాగే గతంలో సల్మాన్ ఖాన్ నటించిన “కిసీ కా భాయ్ కిసీ కీ జాన్” చిత్రంలో బతుకమ్మ పాట పాడిన అనుభవం కూడా తనకు ఉందని నాగవ్వ తెలిపారు. ఈ పాట కోసం మంగ్లీ టీమ్ దాదాపు రూ.15 లక్షలకుపైగా ఖర్చు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ పాటపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై తిరుపతి రెడ్డి స్పందించారు. ఇది మరాఠీ పాటకు కాపీ అన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిజాలు తెలుసుకోకుండా ట్రోల్స్ చేయడం సరికాదని, కళాకారుల కృషిని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి