మంగళగిరి అభివృద్ధికి ఊపిరి – నారా లోకేష్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి రూ.112 కోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆమోదం

ఏపీలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇటీవల ఆయన ఢిల్లీ పర్యటనల సమయంలో కేంద్ర మంత్రులు, అధికారులను వరుసగా కలుస్తుండగా, ఇప్పుడు ఆయన నియోజకవర్గమైన మంగళగిరికు కేంద్రం పెద్ద బహుమతినే ప్రకటించింది. రైల్వే శాఖ తాజాగా మంగళగిరికి చెందిన ఒక ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది.

రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారం, మంగళగిరి–కృష్ణ కెనాల్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న E13 ఎక్స్‌టెన్షన్ రోడ్ వద్ద రూ.112 కోట్ల అంచనా వ్యయంతో ఆరు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణాన్ని ఆమోదించింది. ఈ ప్రతిపాదిత బ్రిడ్జ్ అమరావతి రాజధాని ప్రాంతాన్ని జాతీయ రహదారి-16తో నేరుగా అనుసంధానించబోతోంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రైల్వే శాఖే భరించనున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది.

E13 ప్రాంతం వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం కావడంతో పాటు, ఇది అమరావతి రాజధాని రోడ్డు కనెక్టివిటీకి కీలక కేంద్రంగా ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ చెన్నై–హౌరా రైల్వే మార్గంలో భాగం కావడంతో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. మొదట్లో నాలుగు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రతిపాదించబడినా, అమరావతి భవిష్యత్తు రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆరు లైన్ల బ్రిడ్జ్ ప్రతిపాదనను సమర్పించగా, కేంద్రం దానిని ఆమోదించింది.

ప్రాజెక్టు టెండర్ దశకు వెళ్లే ముందు డిజైన్ ఆమోదం, సాధారణ డ్రాయింగ్‌లు వంటి ప్రాథమిక ప్రక్రియలు త్వరలో పూర్తవుతాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే, అమరావతి నగరానికి వెళ్తున్న వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు, అలాగే రోడ్డు, రైలు ప్రయాణికుల భద్రతకు, ట్రాఫిక్ తగ్గింపుకు ఇది ఎంతో తోడ్పడనుంది.

ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే మంగళగిరి అభివృద్ధికి కొత్త ఊపిరి నింపి, అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల రవాణా వ్యవస్థలో కీలక మైలురాయిగా నిలవనుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి