రాజధాని అమరావతి పరిధిలోని ప్రముఖ మంగళగిరి నియోజకవర్గంలో పలు దశాబ్దాలుగా మీడియారంగానికి సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టులను ఆదివారం ఘనంగా సత్కరించారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వర్గాల జర్నలిస్టులను గుర్తిస్తూ “మంగళగిరి ప్రెస్ క్లబ్” ఆధ్వర్యంలో మొత్తం 20 మంది సీనియర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
తెనాలి రోడ్‌లోని డీబీయన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మూడు మండలాల జర్నలిస్టులు ఆత్మీయంగా పాల్గొన్నారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వానపల్లి బ్రహ్మనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, రంగం అభివృద్ధి, భవిష్యత్ అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులను పిలిచి, ప్రత్యేకంగా రూపొందించిన మంగళగిరి ప్రెస్ క్లబ్ జ్ఞాపికలను అందజేస్తూ గౌరవించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దయాకర్ మాట్లాడుతూ—
“సమాజ మార్పుకు, ప్రజా అవగాహనకు, ప్రజాస్వామ్య బలోపేతానికి అక్షరయోధులైన జర్నలిస్టులు నిరంతరం శ్రమిస్తున్నారు. దశాబ్దాలుగా ఎటువంటి స్వార్థం లేకుండా సేవలందించిన సీనియర్లను గౌరవించడం మాకు గౌరవం. అవకాశం ఉన్న ప్రతిసారి సీనియర్ జర్నలిస్టుల్ని సత్కరించడం మంగళగిరి ప్రెస్ క్లబ్ ధ్యేయం” అని పేర్కొన్నారు.



