మంగళగిరికి శుభవార్త.. నారా లోకేష్ తెచ్చిన రూ.140 కోట్ల కేంద్ర నిధులు, పానకాలస్వామికి రోప్‌వే, మ్యూజియం

మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంగళగిరి నియోజకవర్గానికి కీలక నిధులు సమకూరుతున్నాయి. మంగళగిరిలోని ప్రసిద్ధ శ్రీ పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి అభివృద్ధి పరంగా కొత్త ఊపిరి లభించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ (PRASAD) పథకంలో భాగంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కీలక ముందడుగు పడింది.

మంత్రి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగుతూ మంగళగిరి పానకాలస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని కేంద్రాన్ని కోరారు. దీనికి అనుకూల స్పందన రావడంతో ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. కేంద్రం సహకారంతో ఆలయాన్ని సర్వాంగసుందరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మంగళగిరి పానకాలస్వామి ఆలయ అభివృద్ధి కోసం దాదాపు రూ.140 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు.

ప్రసాద్ పథకం అమలుకు దేవాదాయశాఖ కమిషనర్‌ను ప్రత్యేకాధికారిగా ఇప్పటికే నియమించారు. మంగళగిరితో పాటు శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, అమరావతి ఆలయాలను కూడా ఈ పథకంలో ఇప్పటికే చేర్చారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాల వారసత్వ సంపదను పరిరక్షిస్తూ, సంప్రదాయ వైభవానికి భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టేలా డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. ఈ వివరాలను ఇప్పటికే కేంద్రానికి పంపించగా, స్వల్ప మార్పులతో త్వరలోనే టెండర్లు పిలిచే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రసాద్ పథకంలో భాగంగా మంగళగిరి పానకాలస్వామి ఆలయంలో పలు కీలక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కొండ చివరన ఉన్న గండాలయస్వామి ఆలయ అభివృద్ధితో పాటు, కొండపైకి వెళ్లేందుకు రోప్‌వే ఏర్పాటును ప్రతిపాదించారు. కొండపై పార్కింగ్ సౌకర్యాలు, పార్కుల ఏర్పాటు, భక్తుల కోసం కొండ దిగువన వసతి గదుల నిర్మాణం కూడా ప్రణాళికలో ఉన్నాయి.

అదేవిధంగా కొండ చివరన ‘మంగళగిరి’ అనే పేరుతో 18 అడుగుల ఎత్తులో ప్రతీకాత్మక నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. పోలీస్ క్వార్టర్స్ స్థలాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగించి భక్తులకు అనుకూల సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. మంగళగిరి ఆలయ చరిత్ర, ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది.

అంతేకాకుండా ఎయిమ్స్ రోడ్డు నుంచి పానకాలస్వామి కొండపైకి మరో ఘాట్ రోడ్డు నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న పడమర గాలిగోపురం నిర్మాణాన్ని పూర్తి చేయడం వంటి పనులను కూడా డీపీఆర్‌లో చేర్చారు. ఈ అభివృద్ధి పనులతో మంగళగిరి పానకాలస్వామి ఆలయం భక్తులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి