గుంటూరు జిల్లాలో విస్తృతంగా సాగుతున్న ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్లపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. మంగళగిరి రూరల్ పోలీసుల ప్రత్యేక దళం ఈ ఆపరేషన్‌లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, భారీ ఎత్తున సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకుంది. దొరికిన మొత్తం సొమ్ము, పరికరాల పరిమాణమే ఈ ముఠా కార్యకలాపాల విస్తృతిని బట్టబయలు చేసింది.
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుల వద్ద నుంచి రూ. 6.30 లక్షల నగదు, 5 ల్యాప్‌టాప్‌లు, 32 మొబైల్ ఫోన్లు, 22 బ్యాంకు పాస్‌బుక్‌లు, 30 ఏటీఎం కార్డులు, 11 చెక్కులు సహా అనేక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు వివరాలను డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు. చినకాకాని ప్రాంతంలోని ఎన్నారై ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న ఎస్వీఎన్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ గుట్టుగా సాగుతున్నదన్న స్పష్టమైన సమాచారంతో దాడులు నిర్వహించామని తెలిపారు. దాడిలో మొదట కొక్కిలిగడ్డ ఏసన్నను అదుపులోకి తీసుకోగా, బాలు, ప్రవీణ్, సూర్య పరారయ్యారని, వారిపై ప్రత్యేక నిఘా పెట్టి అనంతరం అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
విచారణలో బయటపడిన మరిన్ని వివరాలు ఈ ముఠా మోసాల తీవ్రతను చూపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు మనోహర్‌కు ఆన్‌లైన్ గేమింగ్‌పై అధిక ఆసక్తి ఉండడంతో టెలిగ్రామ్ ద్వారా వచ్చిన లింక్‌ను నమ్మి hublibook.com అనే వెబ్‌సైట్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనతో పాటు ఇతర నిందితులు కూడా కలిసి పలువురి ఆధార్ కార్డులు, సిమ్ కార్డులను దుర్వినియోగం చేసి సుమారు 30 బ్యాంక్ ఖాతాలు తెరిపించి వాటి ద్వారా డబ్బు లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలింది.
క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ చేస్తే సులభంగా భారీ లాభాలు వస్తాయని నమ్మించి ఇలాంటి మోసాలకు పాల్పడ్డారని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ కేసులో ఇందుకూరి బాలకృష్ణ రాజు, ఏసన్న, మనోహర్, ప్రవీణ్, సూర్య ప్రకాశ్‌లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు.



