జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా ఉద్రిక్తత నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడి, అక్కడ పార్కింగ్‌లో ఉన్న రెండు కార్లపై రాడ్డుతో దాడి చేశాడు. విచక్షణారహితంగా కార్ల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేయడంతో అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతడిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన నీలాద్రిగా గుర్తించారు. నిందితుడు మానసిక అస్థిరత కారణంగా ఈ దాడికి పాల్పడ్డాడా? లేక దీని వెనుక ఏదైనా రాజకీయ ప్రేరణ ఉందా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్టీ కార్యాలయంలోకి రాడ్డుతో ప్రవేశించి వాహనాలను ధ్వంసం చేయడం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు రేపుతోంది. ఘటన సమయంలో కీలక నేతలు ఎవరైనా కార్యాలయంలో ఉన్నారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కార్యాలయం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతడు ఏ ఉద్దేశంతో మంగళగిరి వరకు వచ్చాడు? దాడికి ప్రేరేపించిన కారణాలు ఏమిటి? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఘటన అనంతరం కార్యాలయం వద్ద అదనపు బలగాలను మోహరించి భద్రతను మరింత పటిష్టం చేశారు.



