మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదుగుదలను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ నాయకుడు కాపరౌతు సుందరయ్య ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలకు పార్టీలోని కొందరు నేతలే పరోక్షంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం మంగళగిరి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా సుందరయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వం లేని వారికి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ట్రస్ట్ బోర్డు, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నామినేటెడ్ పదవులు కల్పించారని విమర్శించారు. 2014 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు అవకాశాలు దక్కకపోగా, 2024 ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి సభ్యత్వం లేకున్నా పదవులు ఇవ్వడం అన్యాయమని అన్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది పార్టీ నాయకత్వమేనని స్పష్టం చేశారు.
పార్టీ కార్యక్రమాల్లో ఇన్‌చార్జ్ తప్ప మిగిలిన నాయకులు వేదికపై కనిపించరని, సరైన సమాచార లోపంతో అనేక మంది కార్యకర్తలు కార్యక్రమాలకు దూరమవుతున్నారని తెలిపారు. కొందరు నేతల కారణంగా మంగళగిరిలో జనసేన పార్టీ అభివృద్ధి నిలిచిపోయిందని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు.
లోపాలు చూపించిందుకే పదవి నుంచి తొలగింపు
పార్టీలోని లోపాలను ప్రశ్నించినందుకే తనను ఎర్రబాలెం గ్రామ అధ్యక్ష పదవి నుంచి తొలగించారని సుందరయ్య ఆరోపించారు. గత ఎన్నికల్లో ఎర్రబాలెం గ్రామంలో 5 వేల ఓట్ల రికార్డు మెజార్టీ రావడం తమ కృషికి నిదర్శనమని చెప్పారు. స్థానిక నేతల కోసం కాకుండా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసమే తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
కాపు సామాజికవర్గానికి న్యాయం కావాలి
మంగళగిరిలో జనసేన పార్టీ అభివృద్ధికి కాపు సామాజికవర్గం వెన్నెముకలా ఉందని పేర్కొంటూనే, ఆ వర్గానికి చెందిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం లభించలేదని విమర్శించారు. ఈ అంశాన్ని త్వరలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
లోకేష్ గెలుపుపై ముందస్తు అంచనా
2024 జనవరిలో ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే నారా లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని తాను చెప్పానని సుందరయ్య గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించి, చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజాప్రయోజన కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. కొలంబో వెళ్లి భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌ను వీక్షించిన ఘటనను కూడా వైసీపీ నేతలు రాజకీయం చేసి తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. టిడిపి–జనసేన నేతలపై దుష్ప్రచారం చేసిన ఫలితంగా వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైందని వ్యాఖ్యానించారు.
పేర్లు త్వరలో వెల్లడిస్తా
మంగళగిరిలో జనసేన ఎదుగుదలను అడ్డుకుంటున్న నాయకుల పేర్లు త్వరలో వెల్లడిస్తానని సుందరయ్య స్పష్టం చేశారు. ఇన్‌చార్జ్‌కు అనుకూలంగా వ్యవహరించే వారికే ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి ఉందని, మిగిలిన వారికి పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా అందడం లేదని ఆరోపించారు. 2014 నుంచి క్రియాశీలంగా పనిచేస్తున్న వీర మహిళలకు కూడా ఇప్పటికీ పదవులు లభించకపోవడం బాధాకరమని అన్నారు.



