మలబద్ధకం అనేది చాలా మందిని ఇబ్బందులకు గురిచేసే సాధారణ సమస్య. సమయానికి ఫ్రీ మోషన్ కాకపోవడం వల్ల మొదట్లో చిన్న అసౌకర్యంగా కనిపించినా, దీర్ఘకాలంలో ఇది మరిన్ని జీర్ణ సమస్యలు, గ్యాస్, అజీర్తి, పైల్స్ వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే మలబద్ధకాన్ని ప్రారంభ దశలోనే నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
దీన్ని నివారించేందుకు ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలి. పీచు (ఫైబర్) ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ఈ సమస్య పరిష్కారంలో అత్యంత సులభమైన మరియు సహజమైన మార్గం. పీచు, మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణాశయ మార్గంలో సులభంగా కదిలేలా చేసి, మలాన్ని తేలిగ్గా బయటకు వచ్చేలా చేస్తుంది. అలాగే పీచు ఉన్న ఆహారం రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేయడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
పొట్టుతో కూడిన ధాన్యాలు పీచుకు మంచి మూలాలు. ముఖ్యంగా తెల్లబియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యం, పొట్టు తీయని గోధుమలు, అలాగే ఇతర సంపూర్ణ ధాన్యాలు మలబద్ధకాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. సాధారణ ధాన్యాలతో పోల్చితే తృణధాన్యాల్లో (మిల్లెట్స్) పీచు మరింతగా ఉంటుంది కాబట్టి వీటిని ఆహారంలో చేరుస్తే ఆరోగ్యానికి ద్విగుణీకృతంగా మేలు కలుగుతుంది. ఆకుకూరలు, కాయగూరలు, మొలకెత్తిన ధాన్యాలలో కూడా పీచుపాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పేగు క్యాన్సర్ వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
చిక్కుళ్లు కూడా పీచు మరియు ప్రోటీన్ సమృద్ధిగా కలిగినవి. వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా కండరాలకు బలం పెరగడమే కాకుండా మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. తాజాపండ్లు కూడా పీచుకు చక్కని మూలం. బొప్పాయి, పుచ్చకాయ, నారింజ వంటి పండ్లు పేగు కదలనాన్ని మెరుగుపరిచి మలబద్ధకాన్ని సహజంగా తగ్గిస్తాయి. అయితే పండ్లను రసం రూపంలో తీసుకుంటే పీచు దాదాపుగా నష్టపోతుంది. కాబట్టి పళ్లరసాలకంటే పండ్లను అలాగే కొరికి తినడం ఆరోగ్యానికి మంచిది.



