మహారాష్ట్ర సమృద్ధి హైవేపై లగ్జరీ బస్సు అగ్నిప్రమాదం

మహారాష్ట్ర సమృద్ధి హైవేపై ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. 12 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సులో గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ హుస్సేన్ సయ్యద్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అందరి ప్రాణాలు కాపాడబడ్డాయి.

ముంబై నుంచి జాల్నా వెళ్తున్న బస్సులో డ్రైవర్, అసిస్టెంట్‌తో కలిపి మొత్తం 14 మంది ఉన్నారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నాగ్‌పూర్ లేన్‌లో ప్రయాణిస్తుండగా బస్సు ఇంజిన్‌ భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి, అందరినీ కిందకు దించాడు. కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టేశాయి, కానీ అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, హైవే పోలీసులు, టోల్ ప్లాజా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన కారణంగా నాగ్‌పూర్ లేన్‌లో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా హైవేలపై బస్సుల్లో మంటలు చెలరేగే ఘటనలు పెరుగుతున్నాయి. గత వారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని మంటలు చెలరేగి 19 మంది సజీవదహనమైన విషాదం ఇంకా మరువకముందే తాజా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అదేవిధంగా, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై గత ఆదివారం ఓ డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగగా, డ్రైవర్, కండక్టర్ అప్రమత్తంగా వ్యవహరించి 70 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటపెట్టారు.

ఈ ఘటనలతో హైవేలపై బస్సుల భద్రత, వాహనాల మెయింటెనెన్స్‌పై మళ్లీ చర్చ మొదలైంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి