మహారాష్ట్రలో జరిగిన ఓ భయానక ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. జల్‌గావ్‌లోని శ్మశానవాటికలో దొంగలు దారుణానికి ఒడిగట్టారు. చితిలో మిగిలిన బూడిదను గాలించి, మృతదేహం కపాలం, ఎముకలను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే – జల్‌గావ్ పట్టణానికి చెందిన ఛాబాబాయి కాశీనాథ్ పాటిల్ (వృద్ధురాలు) ఈ నెల 5న మృతి చెందారు. ఆమె చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను తీసేయకుండా అంత్యక్రియలు జరిపారు. సోమవారం ఆమెకు చివరి సంస్కారాలు నిర్వహించిన కుటుంబసభ్యులు మంగళవారం అస్థికలు సేకరించడానికి శ్మశానానికి వెళ్లారు.
అక్కడ చూసిన దృశ్యం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చితిలో బూడిద చిందరవందరగా పడి ఉండగా, వృద్ధురాలి కపాలం, ఎముకలు కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుండగులు బంగారం కోసం చితిని తవ్వి, ఎముకలు, కపాలాన్ని ఎత్తుకెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్మశానవాటికలో భద్రతా ఏర్పాట్లు లేకపోవడాన్ని కుటుంబసభ్యులు, స్థానికులు మున్సిపాలిటీ సిబ్బందిపై తీవ్రంగా నిలదీశారు. ఒక తులం బంగారం కోసం మృతదేహాన్ని కూడా విడిచిపెట్టని దుండగుల క్రూరత్వం సమాజాన్ని కుదిపేసింది.



