మధ్యప్రదేశ్‌ పాఠశాలలో విద్యార్థులకు పేపర్‌లో భోజనం – వీడియో వైరల్, రాహుల్ గాంధీ ఆగ్రహం

మధ్యప్రదేశ్‌లో మరోసారి ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నిర్లక్ష్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. షియోపూర్ జిల్లాలోని హల్పూర్ గ్రామ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పేపర్ ముక్కల్లో వడ్డించడం పెద్ద వివాదానికి దారితీసింది. పాఠశాల ప్రాంగణంలో చెత్తాచెదారం మధ్య నేలపై కూర్చుని పిల్లలు న్యూస్‌పేపర్ ముక్కల్లో వడ్డించిన ఆహారాన్ని తింటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ దృశ్యాలు చూసిన అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంటూ, “దేశ భవిష్యత్తు అయిన పిల్లలకు కనీసం ప్లేట్లలో భోజనం చేసే గౌరవం కూడా దక్కకపోవడం దురదృష్టకరం” అంటూ వ్యాఖ్యానించారు. “మధ్యప్రదేశ్‌లో 20 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం చిన్నారుల కంచాలను కూడా దొంగిలించింది” అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును ఇంత నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తున్నందుకు సీఎం మరియు ప్రధాని మోదీ సిగ్గుపడాలని ఆయన విమర్శించారు.

వీడియో వైరల్ కావడంతో జిల్లా అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించారు. పీఎం పోషణ్ పథకం కింద భోజనం అందిస్తున్న స్వయం సహాయక బృందాన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అదనంగా, శనివారం నాటికి పాఠశాలకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాదోపవాదాలు ముదురుతున్నాయి. బీజేపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలా దయనీయంగా మారడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అధికారులు పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి