1500 కిమీ దూరం నుంచి యజమానిని చేరుకున్న శునకం! ఇలాంటి అద్భుతం ఎప్పుడైనా చూశారా?

చైనాలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం కనిపించకుండా పోయిన ఓ పెంపుడు లాబ్రడార్ శునకం, దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు తన అసలైన యజమాని చెంతకు చేరి అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ – కింగ్‌డావో బీచ్ ప్రాంతంలో నివసించే గావో అనే మహిళ, ‘సెప్టెంబర్’ అనే లాబ్రడార్‌ను పెంచుకుంటోంది. ఆగస్టు 13న జరిగిన బీర్ ఫెస్టివల్ సందర్భంగా, అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో సెప్టెంబర్ మరో శునకంతో కలిసి వెళ్లిపోతున్న దృశ్యం కనిపించింది. గావో స్థానిక జంతు సంరక్షణ కేంద్రాలు, ఆన్‌లైన్ గ్రూపులు, సోషల్ మీడియా వంటి అన్ని మార్గాల్లో వెతికినా ఆ శునకానికి ఎలాంటి గుర్తులు కనిపించలేదు. దీంతో చివరకు ఆమె మనసులో ఆశలు మొత్తం మసకబారిపోయాయి.

అయితే మూడు నెలల తర్వాత అద్భుతం జరిగింది. కింగ్‌డావో నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంగ్షా నగరంలో, భారీ వర్షంలో తడుస్తూ వీధిలో తిరుగుతున్న సెప్టెంబర్‌ను ఝౌ అనే మహిళ గుర్తించింది. దానికి ఆహారం ఇచ్చి తన ఇంటికి తీసుకెళ్లి కాపాడింది. అనంతరం శునక వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆశ్చర్యకరంగా ఆ వీడియోలు సెప్టెంబర్ కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గావో దృష్టికి వచ్చాయి. వెంటనే ఆమె ఝౌతో సంప్రదింపులు జరిపింది.

ఈ నెల 8న పెట్ రిలోకేషన్ సర్వీస్ సహాయంతో సెప్టెంబర్‌ను కింగ్‌డావోకి తిరిగి పంపించారు. యజమాని గావోను చూసిన వెంటనే సెప్టెంబర్ ఆనందంతో ఆమెపైకి దూకి రోదించడం, అక్కడున్న వారందరినీ కదిలించింది. “బహుశా పర్యాటకులు దాన్ని తమతో తీసుకెళ్లి ఉండవచ్చు. ఏమైనా సరే, ఆ మూడు నెలల్లో అది ఎన్నో కష్టాలు పడ్డట్టే ఉంది” అని గావో భావోద్వేగంగా తెలిపారు. అలాగే “ముందు బద్దకస్తురాలిలా ఉండే నా సెప్టెంబర్ ఇప్పుడు చాలా చురుకుగా మారింది” అని ఆమె ఆశ్చర్యపోయారు.

ఈ అద్భుత పునఃసమాగమం చైనా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. శునక ప్రేమకు సరిహద్దులే లేవని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి