ఉపాధ్యాయులే ఆంధ్రప్రదేశ్ విద్యారంగ అభివృద్ధికి మూలస్తంభం: లోకేష్
ఉండవల్లి:
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను దేశంలోని మోడల్ సిస్టంగా మార్చేందుకు ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి పలు కీలక అంశాలపై వినతులు సమర్పించారు.
ఈ సందర్భంగా వారు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు MEo పోస్టుల్లో అవకాశం కల్పించాలని, అలాగే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం కూడా అందజేశారు.
పారదర్శక బదిలీలు, మోడల్ ప్రైమరీ స్కూళ్లపై హర్షం
నోబుల్ టీచర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇటీవల ఉపాధ్యాయ బదిలీలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయన్న విషయం ఉపాధ్యాయ సమాజంలో విశ్వాసం పెంచిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటవుతున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లతో ఉపాధ్యాయుల్లో సానుకూలత పెరుగుతోందని వెల్లడించారు.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది: మంత్రి హామీ
ఈ సందర్భంలో నారా లోకేష్ మాట్లాడుతూ,
“ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను చర్చల ద్వారానే పరిష్కరిస్తాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. మీ సమస్యలు నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు,” అని భరోసా ఇచ్చారు.
అంతేకాక, ఇకపై ప్రతి జిల్లాలో జరిగే క్లస్టర్ సమావేశాలకు తానే స్వయంగా హాజరవుతానని వెల్లడించారు. విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలతో పాటు నైతిక విలువలు పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులదేనని గుర్తుచేశారు.
“ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలి. అంకితభావంతో పనిచేస్తేనే విద్యా రంగంలో ఒత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి,” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రతినిధుల వివరాలు:
ఈ సమావేశంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి బొనిగెల హైమారావు, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ చెరుకూరి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక కార్యదర్శి జె.శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు ఎమ్.రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.



