కర్నూలు జిల్లాలో నేర కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హత్య కేసులు, దౌర్జన్యాలు, బెదిరింపులు వంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులను జిల్లానుంచి బహిష్కరిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తండ్రితో పాటు ముగ్గురు కుమారులను ఏకంగా జిల్లా వెలుపలికి పంపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు నగరంలోని షరీన్ నగర్ ప్రాంతం గత కొంతకాలంగా నేరాలకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 11న జరిగిన టీడీపీ నేత సంజన్న హత్య కేసు ఈ ప్రాంతాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఈ హత్యలో రౌడీషీటర్ వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజి ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతడితో పాటు అతని కుమారులు వడ్డే తులసి కుమార్, వడ్డే శివకుమార్, వడ్డే రేవంత్ కుమార్‌లు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరందరిపై ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే రౌడీషీట్లు ఉన్నాయి.
ఈ నలుగురు అరెస్టై జైలుకు వెళ్లినా, బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని పోలీసులు చెబుతున్నారు. నేరాలకు పాల్పడుతూనే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గుర్తించిన అధికారులు కఠిన నిర్ణయానికి వచ్చారు. వీరిని జిల్లానుంచి బహిష్కరిస్తే కనీసం శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయన్న ఉద్దేశంతో చర్యలకు ఉపక్రమించారు.
జిల్లా ఎస్పీ ప్రతిపాదనల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి తొలుత డిసెంబర్ 11న వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజిని జిల్లా బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మూడు రోజుల క్రితం అతని కుమారుడు తులసి కుమార్‌పై కూడా అదే విధమైన ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా మరో ఇద్దరు కుమారులు శివకుమార్, రేవంత్ కుమార్‌లను కూడా జిల్లానుంచి బహిష్కరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతున్న అనేక నేరాల్లో రౌడీషీటర్ల పాత్ర ఉండటం, జైలుకు వెళ్లి వచ్చినా మార్పు కనిపించకపోవడంతోనే ఈ తరహా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో ఐదుగురిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా బహిష్కరణతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా నేరస్తులు మారాలని పోలీసులు సూచిస్తున్నారు.



