కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా, మంటలు చెలరేగిన వెంటనే 12 మంది అత్యవసర ద్వారం ద్వారా బయటపడగలిగారు. వారిలో కొందరు స్వల్ప గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం తర్వాత వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ ను పరిశీలించి కీలక వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “బస్సులో 38 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 11 మృతదేహాలను వెలికితీశాం. మరికొందరు గల్లంతయ్యారని, శోధన కొనసాగుతోందని” తెలిపారు.
డీఐజీ వివరాల ప్రకారం, ఈ ప్రమాదానికి కారణం ఒక బైక్ను ఢీకొనడమే. ఢీకొట్టిన సమయంలో బస్సు కింద ఉన్న ఇంధన పైప్ దెబ్బతిని మంటలు చెలరేగాయి. ఆ క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో కూరుకుపోయింది. ప్రధాన డ్రైవర్ ఘటన తర్వాత పారిపోయినట్లు, మరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రులందరికీ తక్షణ వైద్య సహాయం అందజేస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
కలెక్టర్ సిరి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ, “ఘటన చాలా దురదృష్టకరమైనది. బస్సు బైక్ను ఢీకొట్టిన వెంటనే ఒక కేబుల్ తెగిపోయి మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అధికారులు స్పందించి, సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశాం” అని వివరించారు.
అదే సమయంలో ఈ ప్రమాదం వెనుక మరో షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. బస్సుకు సంబంధించిన ఇన్సూరెన్స్ మరియు అనుమతుల గడువు ముగిసినట్లు సమాచారం బయటపడింది. అంటే, బస్సు చట్టపరమైన రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తున్న అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ట్రాన్స్పోర్ట్ శాఖ కూడా విచారణ ప్రారంభించింది.
బాధితుల కుటుంబాలకు సమాచారం చేరవేసేందుకు అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08518-277305
- కర్నూలు ప్రభుత్వాసుపత్రి: 91211 01059
- ఘటనా స్థలి వద్ద: 91211 01061
- కర్నూలు పోలీస్ స్టేషన్: 91211 01075
- కర్నూలు జనరల్ హాస్పిటల్: 94946 09814, 90529 51010
ఏవైనా సమాచారం కావాలన్నా లేదా సహాయం అవసరమైతే ఈ నంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ సిరి విజ్ఞప్తి చేశారు.
ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం, బస్సులో ఉన్న ప్రయాణికులలో చాలా మంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రతా ప్రమాణాలు, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహణపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. అనుమతులు లేని బస్సులు రాత్రి వేళల్లో ఎలా నడుస్తున్నాయి? బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పత్రాలు తనిఖీ చేయడంలో అధికారులు ఎక్కడ విఫలమయ్యారు? అనే అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.
నెల్లూరు కుటుంబం సజీవ దహనం: గ్రామంలో విషాదం
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ కుటుంబం ఘోర విషాదానికి గురైంది. రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు కలిసి సజీవదహనమై మృతిచెందారు. ఉపాధి కోసం బెంగళూరులో స్థిరపడ్డ ఈ కుటుంబం, హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన భయానక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఒక్కసారిగా కుటుంబం మొత్తం మృతి చెందడంతో గోళ్లవారిపాలెం గ్రామంలో దుఃఖ వాతావరణం నెలకొంది.



