కర్నూలు జిల్లా శివారులో ఘోర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి (NH-44) పై దుర్ఘటనకు గురైంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యారని ప్రాథమిక సమాచారం. 12 మంది స్వల్ప గాయాలతో బయటపడగా, మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ భయానక ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఆవేదనను రేపింది.
ఏం జరిగింది?
తెలుసుకున్న వివరాల ప్రకారం, ప్రైవేట్ బస్సు కర్నూలు శివారులోని ఉలిందకొండ సమీపంలో వెళ్తుండగా ఒక ద్విచక్రవాహనం బస్సును ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందకు దూసుకుపోయి, ఇంధన ట్యాంక్‌ను తాకడంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే మంటలు మొత్తం బస్సును కమ్మేశాయి.
ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా, అప్రమత్తమైన 12 మంది బస్సు అద్దాలను పగులగొట్టి కిందకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. అయితే మిగిలిన వారు మంటల్లో చిక్కుకుని బయటపడలేకపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 4 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. అయినప్పటికీ బస్సు పూర్తిగా కాలిపోయింది.
ప్రమాదం నుంచి బయటపడ్డవారు
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డవారిలో రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. ఈ ఘటన అనంతరం బస్సు డ్రైవర్లిద్దరూ పరారైనట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రాష్ట్ర నాయకుల సంతాపం
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆయన, బాధితులను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ఆయన, ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజల్లో ఆందోళన
ఈ భయానక అగ్నిప్రమాదం ప్రజల్లో తీవ్ర కలకలం రేపింది. బస్సు సర్వీస్‌ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాత్రి ప్రయాణ బస్సులపై పర్యవేక్షణ పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు.



