“కోడి ముందా? గుడ్డు ముందా?” వివాదానికి శాస్త్రీయ ముగింపు – బ్రిస్టల్ యూనివర్సిటీ అధ్యయనం

“కోడి ముందా? గుడ్డు ముందా?” అనే ప్రశ్న శతాబ్దాలుగా మనుషుల్ని అయోమయంలో పడేస్తూనే ఉంది. పండితుల నుంచి చిన్నపిల్లల వరకూ ఎంతోమంది దీనిపై చర్చించినా, స్పష్టమైన సమాధానం దొరకలేదనే భావన ఇప్పటివరకూ ఉంది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు శాస్త్రీయ ఆధారాలతో కూడిన సమాధానం లభించిందని వెల్లడిస్తున్నారు.

ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు, నాంజింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో కలిసి నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, ఈరోజు మనకు కనిపించే పక్షులు, సరీసృపాల పురాతన పూర్వీకులు మొదటగా గుడ్లు పెట్టే జీవులు కాకపోవచ్చని తేలింది. వారు నేరుగా పిల్లలకు జన్మనిచ్చే విధానాన్నే తొలుత అనుసరించి ఉండవచ్చని ‘ది టైమ్స్’ నివేదించింది. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్ఠాత్మక ‘నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

బ్రిస్టల్ యూనివర్సిటీ ఎర్త్ సైన్సెస్ స్కూల్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో 51 జీవ శిలాజ జాతులు, ప్రస్తుతం జీవిస్తున్న 29 జాతులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వీటిలో గుడ్లు పెట్టే జంతువులతో పాటు నేరుగా పిల్లలను కనేవి కూడా ఉన్నాయి. ఈ పరిశీలనలో అమ్నియోటిక్ జంతువులు (సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు) ఉభయచరాల కంటే భిన్నమైన పునరుత్పత్తి విధానాన్ని కలిగి ఉన్నాయని స్పష్టమైంది.

ఉభయచరాల గుడ్లకు గట్టి పొర ఉండదు. అదనపు భ్రూణపు పొరలు కూడా లేవు. కానీ అమ్నియోటిక్ గుడ్లలో అమ్నియన్, కోరియన్, అలాంటాయిస్ వంటి ప్రత్యేక భ్రూణపు పొరలు ఉంటాయి. అలాగే వాటి బయట గట్టి లేదా కొంత మెత్తని పొర కనిపిస్తుంది. కొన్ని జంతువుల గుడ్లకు ఖనిజాలతో కూడిన బలమైన పొర ఉండగా, మరికొన్నిటికి పలుచని పొర మాత్రమే ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

ఈ అధ్యయనంలో మరో కీలక అంశం ఏమిటంటే—సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇప్పటి రూపాన్ని సంతరించుకునే ముందు నేరుగా పిల్లలకు జన్మనిచ్చే జీవులుగా ఉండేవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆ ప్రారంభ దశలో ఇవి పునరుత్పత్తికి నీటిపై ఎక్కువగా ఆధారపడేవి. పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేనప్పుడు, పిల్లలను గర్భంలోనే దాచుకుని రక్షించుకునే విధానాన్ని అవలంబించాయి. క్రమంగా భూమిపై జీవనానికి అలవాటు పడిన తర్వాతే గుడ్లు పెట్టే విధానం అభివృద్ధి చెందింది.

ఇప్పటికీ కొన్ని జీవ జాతుల్లో ఈ మార్పు దశ కనిపిస్తుంది. ఉదాహరణకు, కొన్ని బల్లుల జాతులు కొన్ని సందర్భాల్లో నేరుగా పిల్లలకు జన్మనిస్తే, మరికొన్ని సందర్భాల్లో గుడ్లు పెడతాయి. ఇది పరిణామ క్రమంలో జరిగిన మార్పులకు ప్రత్యక్ష ఉదాహరణగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ విధంగా బ్రిస్టల్ యూనివర్సిటీ, నాంజింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసిన ఈ పరిశోధన, “కోడి ముందా? గుడ్డు ముందా?” అనే ప్రశ్నకు శాస్త్రీయంగా కొత్త కోణంలో సమాధానాన్ని సూచిస్తూ, జీవ పరిణామ చరిత్రపై మరింత స్పష్టతను అందిస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి