డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మానవతను తాకే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కొడుకులేని అత్తకు తానే కొడుకులా మారి, కోడలు చివరి వరకు తన బాధ్యతను నిర్వర్తించింది. కుటుంబ బంధం, మానవ విలువలు ఇంకా బ్రతికే ఉన్నాయనే స్ఫూర్తిని కలిగించే ఈ సంఘటన స్థానికులను కదిలించింది.
వివరాల్లోకి వెళితే – ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి భర్త చాలా కాలం క్రితమే మరణించారు. ఆ తరువాత ఆమెకు ఏకైక బలంగా ఉన్న కుమారుడు కూడా మూడేళ్ల క్రితం దురదృష్టవశాత్తు కన్నుమూశాడు. ఈ కష్టసమయంలో కోడలు శ్రీదేవి తన ఇద్దరు చిన్నారులతో (ఏడేళ్ల మనవరాలు, నాలుగేళ్ల మనవడు) అత్తకు అండగా నిలిచింది. ఆదిలక్ష్మిని తల్లిలా చూసుకుంటూ, ఆమెకు ఆప్యాయత నింపుతూ జీవించింది.
ఇంతలో, ఆదివారం ఆదిలక్ష్మి అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇంట్లో మగవారు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలు ఎవరు నిర్వహించాలనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ, కోడలు శ్రీదేవి తానే కొడుకుగా మారి, అత్తకు తలకొరివి పెట్టి చివరి సంస్కారాలు శాస్త్రోక్తంగా నిర్వహించింది.
ఆమె ఈ నిర్ణయం స్థానికులను భావోద్వేగానికి గురిచేసింది. అత్తా-కోడళ్ల అనుబంధం ఇంత మానవీయంగా, ప్రేమతో నిండుగా ఉంటుందని చూసి గ్రామస్తులు కళ్లలో నీరు పెట్టుకున్నారు. కోడలు శ్రీదేవి చూపిన ఈ మానవతా విలువ సమాజానికి స్ఫూర్తిగా నిలిచింది.



