ఈ రోజుల్లో ఇంటికి తాళం వేయకపోతే నిమిషాల్లో దొంగతనం జరిగిపోతుందన్న భయం అందరిలోనూ ఉంది. సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉన్నా కూడా ఆ భయం పూర్తిగా పోవడం లేదు. కానీ మన దేశంలోనే ఒక అద్భుతమైన గ్రామం ఉంది. అక్కడ ఇళ్లకు తాళాలు ఉండవు. షాపులు ఉంటాయి కానీ షాపుకీపర్లు ఉండరు. అంతా కేవలం “నమ్మకం” అనే బలమైన పునాదిపైనే నడుస్తుంది.
నాగాలాండ్ రాష్ట్రంలోని ఖోనోమా గ్రామం గురించి విన్నారా? ఇది ప్రకృతి అందాలతో పాటు, అక్కడి ప్రజల నిజాయితీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో దుకాణాల్లో సరుకులు అమర్చి ఉంటాయి కానీ అమ్మేవారు కనిపించరు. కొనుగోలుదారులు తమకు కావాల్సిన వస్తువులను తీసుకుని, అక్కడ స్పష్టంగా రాసి ఉన్న ధర ప్రకారం డబ్బును పెట్టెలో వేసి వెళ్లిపోతారు. ఎవరూ చూడటం లేదన్న అవకాశం ఉన్నా మోసం చేయాలన్న ఆలోచన కూడా ఇక్కడ ఎవరికి రాదు. సుమారు 1900 మంది జనాభా ఉన్న ఈ గ్రామం నిజాయితీకి, సామూహిక విలువలకు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రధానంగా అంగామీ తెగకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారు.
ఖోనోమాలోని ఈ ప్రత్యేక విధానం చూసి పర్యాటకులు విస్తుపోతుంటారు. ప్రతి వస్తువుపై ధర స్పష్టంగా రాసి ఉంటుంది. కొనుగోలు చేసిన వారు స్వచ్ఛందంగా డబ్బు చెల్లిస్తారు. దుకాణాలే కాదు, ఇళ్లకూ తాళాలు ఉండవు. ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన విశ్వాసమే ఇందుకు కారణం. అంతేకాదు, గ్రామంలో ఒక కమ్యూనిటీ లైబ్రరీ కూడా ఉంది. ఎవరికి నచ్చిన పుస్తకాన్ని తీసుకెళ్లి చదివి తిరిగి ఉంచవచ్చు. లేదా కొత్త పుస్తకాలను విరాళంగా అందించవచ్చు.
ఈ గ్రామానికి మరో విశిష్టత కూడా ఉంది. ఖోనోమా భారతదేశంలోని తొలి ‘గ్రీన్ విలేజ్’. 1998లో ఇక్కడ వేటను పూర్తిగా నిషేధించారు. ఒకప్పుడు వేటే ప్రధాన వృత్తిగా ఉన్న అంగామీ గిరిజనులు, పర్యావరణ పరిరక్షణ కోసం ఆ జీవన విధానాన్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టారు. ప్రస్తుతం అటవీ సంపద సంరక్షణ, వ్యవసాయం, పశుపోషణ ద్వారా జీవనం సాగిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం వంటి వినూత్న పద్ధతులు ఇక్కడ అమలులో ఉన్నాయి. ఖోనోమాలోని నీటి రీసైక్లింగ్ విధానాన్ని నాసా శాస్త్రవేత్తలు కూడా ప్రశంసించడం ఈ గ్రామ పర్యావరణ స్పృహకు నిదర్శనం.
ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్, దొంగతనాల భయాలతో ప్రజలు నిత్యం ఒత్తిడిలో జీవిస్తుంటే, ఖోనోమా వాసులు మాత్రం ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఉంటూనే ఆధునిక ప్రపంచానికి నిజాయితీ, నైతికత, సామూహిక బాధ్యత వంటి విలువలను బోధిస్తున్నారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలిచిన ఘన చరిత్ర ఈ గ్రామానికి ఉంది. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ ద్వారా మరో విజయాన్ని సాధించింది. ఇక్కడి కోట, పచ్చని ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి గ్రామం మన దేశంలో ఉండటం నిజంగా గర్వకారణమే.



