ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం దుకాణం వద్ద ఫుల్‌గా మద్యం సేవించిన ఓ యువకుడు అక్కడే కూలిపోయి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మృతుడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో ఉన్న క్రాంతి వైన్స్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఇనగడప గ్రామానికి చెందిన వేల్పుల గోపి (28) అనే యువకుడు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలోని అత్తగారి ఇంటికి వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు.
నిన్న సాయంత్రం గోపి మర్లపాడులోని క్రాంతి వైన్ షాపుకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సిట్టింగ్ ఏరియాలో కూర్చొని మద్యం సేవించాడు. సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి అతిగా మద్యం తాగినట్లు సమాచారం. వైన్ షాప్ మూసివేసే సమయంలో కూడా గోపి కదలకుండా అక్కడే వాలిపోయి ఉండటాన్ని గమనించిన షాప్ నిర్వాహకులు వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
అంబులెన్స్ ద్వారా గోపిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే గోపి మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన ఇనగడపకు తరలించారు.
ఈ ఘటనపై మృతుడి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైన్ షాప్ ప్రాంగణంలో ఉన్న సిట్టింగ్ రూమ్‌లో గోపి చాలా సేపు కదలకుండా ఉన్నప్పటికీ ఎవ్వరూ గమనించకపోవడంపై వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో గుర్తించి ఆసుపత్రికి తరలించి ఉంటే గోపి ప్రాణాలు దక్కేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు కేసును విచారిస్తున్నారు. దుకాణం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని గోపి మృతి ఎలా జరిగిందన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెందాడా..? లేదా మద్యం మత్తులో గుండెపోటు వచ్చిందా..? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


