ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక ఘటన మానవ సంబంధాల విలువ ఎంతగా పడిపోయిందో మరోసారి రుజువు చేసింది. స్వార్థం, ప్రేమ, ఆర్థిక ప్రయోజనాల కోసం నేటి సమాజంలో ఎంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ఈ ఘటన మనసు కదిలించేలా ఉంది.
సత్తుపల్లి పట్టణానికి చెందిన షేక్ గౌస్‌కు సుమారు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. బ్రతుకు తెరువు కోసం సమీపంలోని గ్రామానికి వెళ్లి ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అయితే ఇటీవల తన భార్య తన స్నేహితుడితో అన్యోన్య సంబంధం కొనసాగిస్తోందని గౌస్‌కి తెలిసింది. ఈ విషయాన్ని గౌస్ మొదట గంభీరంగా ఆలోచించినప్పటికీ, చివరికి అతను అంచనాలకు అందని నిర్ణయం తీసుకున్నాడు.
తన భార్యకు ఆమె ప్రియుడితో హిందూ సంప్రదాయ పద్ధతిలో తానే స్వయంగా తాళి కట్టి పెళ్లి జరిపించాడు. పెళ్లి కార్యక్రమం ముగిసిన తరువాత సత్తుపల్లి పట్టణంలోని తన ఇంటికి వెళ్లిన గౌస్ గుండె చప్పుడు ఆగిపోయే నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
గౌస్ దంపతులకు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకోవడం, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు చిన్నారులు ఇప్పుడు అనాథలయ్యారు. గ్రామస్తులు ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఇంత పెద్ద మనసుతో భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసిన గౌస్… అయినా పిల్లల కోసమే అయినా బతికి ఉండాల్సింది” అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
కుటుంబ కలహాల కారణంగా గౌస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



