ఛత్తీస్‌గడ్–తెలంగాణ సరిహద్దుల్లోని సాంద్రమైన అడవుల మధ్య ఉన్న కర్రెగుట్టలు మళ్లీ తుపాకీ మోతలతో మార్మోగాయి. సుమారు 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతం, అందులోనూ తెలంగాణ భూభాగంలో సుమారు 90 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టు చలనం ఎక్కువగా ఉండటంతో భద్రతాబలగాలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాయి.
ఏప్రిల్, మే నెలల్లో ‘బచావో కర్రెగుట్టలు’, అనంతరం ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ పేరుతో సుమారు 24 వేల మంది పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. డ్రోన్లతో అడవులపై నిఘా పెట్టి, పర్వతాల మధ్య ఉన్న మావోయిస్టు దాచుబండ్లను శోధించారు. అయితే ఆ సమయంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు పీఎల్‌జీ మావోయిస్టులు (వీరిలో ముగ్గురు మహిళలు) హతమయ్యారు. ఆ తర్వాత పెద్దగా పురోగతి జరగలేదు.
తాజా ఘటనతో మళ్లీ ఉద్రిక్తత
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని కేంద్ర బలగాలు దేశ సరిహద్దులకు తరలించడంతో ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆ తర్వాత బలగాలు అబూజ్‌మఢ్ ప్రాంతంపైనే దృష్టి సారించాయి. అయితే కర్రెగుట్టల్లో 30కి పైగా భారీ కొండలు ఉండటం, అడవుల ఘనత కారణంగా మావోయిస్టులకు ఇది రక్షిత ఆశ్రయం అయ్యింది. గతంలో భద్రతాబలగాలు నీలం కొండ (సరాయ్), దోబే కొండ, ఆలుబాకల వద్ద మూడు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి శోధన చర్యలు చేపట్టాయి. ఒక దశలో వెయ్యి మంది మావోయిస్టులు తలదాచుకున్న గుహలను గుర్తించినా, పెద్దగా ఫలితం దక్కలేదు.
శుక్రవారం ఉదయం మావోయిస్టుల దాడి
తాజాగా శుక్రవారం ఉదయం మావోయిస్టులు భద్రతాబలగాల బేస్ క్యాంపులపై అకస్మాత్తుగా దాడి చేసినట్లు సమాచారం. కొత్త క్యాంపు ఏర్పాటు పనుల కోసం బలగాలు అడవిలోకి అడుగుపెట్టిన సమయంలోనే మావోయిస్టులు కాల్పులు జరిపారని, దానికి ప్రతిగా భద్రతాబలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయని అధికారులు తెలిపారు.
సుమారు గంట పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరగలేదని ఓ అధికారి ‘సాక్షి డిజిటల్’కు తెలిపారు.
కర్రెగుట్టల్లో ఇంకా 400 మంది మావోయిస్టులేనా?
తాజా దాడి నేపధ్యంలో కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో ఇంకా 400 మంది వరకు మావోయిస్టులు తలదాచుకుని ఉన్నారని అంచనా వేస్తున్నాయి. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పీఎల్‌జీ కమాండర్లు మృతిచెందినా, ఇప్పటికీ హిడ్మా నేతృత్వంలోని పీఎల్‌జీ తొలి బెటాలియన్ దళాలు కర్రెగుట్టల్లో ఉండే అవకాశం ఉందని బలగాలు భావిస్తున్నాయి.
ఈ ఘటనతో భద్రతాబలగాలు కూంబింగ్ చర్యలను ముమ్మరం చేశాయి. అయితే ప్రస్తుతం మోంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, బురద, ఊబులు, విషసర్పాల ఉనికి కారణంగా అడవిలో కదలికలు కష్టంగా మారాయి. దాంతో, డ్రోన్ల సాయంతో శోధన చర్యలు మరింత జాగ్రత్తగా కొనసాగిస్తున్నాయి.



