కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: సీబర్డ్ ట్రావెల్స్ బస్సు దగ్ధం, 17 మంది సజీవదహనం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 17 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

సీబర్డ్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. బుధవారం రాత్రి 8:25 గంటలకు బెంగళూరులోని గాంధీనగర్ నుంచి గోకర్ణకు బయలుదేరిన ఈ బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 25 మంది గోకర్ణ, ఇద్దరు శివమొగ్గ, మరో ఇద్దరు కుమటాకు వెళ్లాల్సి ఉంది.

వేకువజామున సుమారు 2:45 గంటల ప్రాంతంలో చిత్రదుర్గ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి-48పై, హిరియూర్ సమీపంలోని జవనగొండనహళ్లి–గోరట్లు క్రాస్ వద్ద బస్సు అదుపు తప్పింది. అతివేగంతో వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న భారీ కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ప్రభావంతో క్షణాల్లోనే బస్సులో మంటలు చెలరేగాయి.

ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు బయటకు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా మంటలు వేగంగా వ్యాపించాయి. కంటైనర్ కూడా అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలో ఉండటంతో వారు బయటకు రాలేకపోయారని అధికారులు తెలిపారు.

అయితే, అకస్మాత్తుగా చెలరేగిన మంటల నుంచి 10 మంది ప్రయాణికులు కిటికీ అద్దాలను పగులగొట్టి బయటికి రాగలిగారు. వారికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. మంటల ఉధృతికి 17 మందికి పైగా ప్రయాణికులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గ జిల్లా పోలీసులు, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారి-48పై జవనగొండనహళ్లి వద్ద భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శిరా నుంచి హిరియూర్ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడంలో కొంత జాప్యం ఏర్పడింది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రంజిత్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై హిరియూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి