ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విచిత్రమైన, అదే సమయంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహితపై మాజీ ప్రియుడు దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆ మహిళ ఆత్మరక్షణలో తీసుకున్న చర్య ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బలవంతంగా ముద్దు పెట్టడానికి యత్నించిన మాజీ ప్రియుడి నాలుకను ఆ మహిళ గట్టిగా కొరికేయడంతో అతడి నాలుకలో కొంత భాగం తెగిపోయింది. రక్తపుమడుగులో తూలిన వ్యక్తి స్థానికులను సహాయం కోసం అరుస్తూ పడిపోయాడు.
ఘటన ఎలా జరిగింది?
చంపీ (35) అనే వ్యక్తి ఇప్పటికే వివాహితుడు. అయినప్పటికీ, ఒక పెళ్లి కాని యువతితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇటీవల ఆ యువతికి ఆమె కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించడం వల్ల, ఆమె చంపీకి దూరమవడం ప్రారంభించింది. పెళ్లి దగ్గరపడడంతో ఆమె పూర్తిగా తన మాజీ ప్రియుడికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మార్పును అంగీకరించలేని చంపీ తరచూ ఆమెను కలవడానికి ప్రయత్నిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు.
సోమవారం మధ్యాహ్నం, ఇంటి పనుల కోసం మట్టిని సేకరించేందుకు యువతి చెరువు వద్దకు ఒంటరిగా వెళ్లింది. ఆమెను ఒంటరిగా చూసిన చంపీ వెంట వెంటనే అక్కడికి చేరి, మాట్లాడేందుకు ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. పరిస్థితి క్షణాల్లో ఉద్రిక్తం కావడంతో చంపీ ఆమెను బలవంతంగా పట్టుకుని వేధింపులకు దిగాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించినా అతను ప్రయత్నం ఆపలేదు.
చంపీ బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించగా, ఆ యువతి ఆత్మరక్షణలో భాగంగా అతడి నాలుకను గట్టిగా కొరికింది. ఒక్కసారిగా నాలుకలో భాగం తెగిపోవడంతో చంపీ అక్కడికక్కడే రక్తస్రావంతో విలవిలలాడిపోయాడు.
ఆసుపత్రికి తరలింపు
అరుపులు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చంపీని మొదట స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, గాయాల తీవ్రత దృష్ట్యా కాన్పూర్‌లోని పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దినేష్ త్రిపాఠి ధృవీకరించారు. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మాజీ ప్రియుడి అఘాయిత్యాన్ని ధైర్యంగా ఎదుర్కొందని స్థానికులు ఆ మహిళ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.



