శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిర్విరామంగా చేస్తున్న సేవలు అందరికీ తెలిసిందే. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ఎందరో ఉన్నారు. అలాంటి అంకితభావానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచే ఘటన తాజాగా కాకినాడలో చోటుచేసుకుంది. తనకు ప్రత్యక్షంగా ఎలాంటి డ్యూటీ సంబంధం లేకపోయినా, ప్రజల ఇబ్బందిని గమనించిన ఓ మహిళా కానిస్టేబుల్ స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సును సురక్షితంగా దారి చూపించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం… నిన్న (శనివారం) సీఎం పర్యటన సందర్భంగా రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతికి కాకినాడలో విధులు కేటాయించారు. డ్యూటీ కోసం ఆమె తన చిన్నబిడ్డను కాకినాడలోని బంధువుల ఇంట్లో ఉంచి బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం పర్యటన ముగిసిన అనంతరం స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో, కాకినాడ–సామర్లకోట రహదారిలో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో, అత్యవసరంగా వెళ్లాల్సిన అంబులెన్స్ ఇరుక్కుపోయింది. ఆ పరిస్థితిని చూసిన జయశాంతి మౌనంగా ఉండలేకపోయారు. వెంటనే తన బిడ్డను చంకలో ఎత్తుకుని రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌ను నియంత్రించారు. కొద్దిసేపట్లోనే అంబులెన్స్‌కు దారి కల్పించి పరిస్థితిని సజావుగా మార్చారు.
ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు, స్థానికులు ఆమె సేవా భావానికి అభినందనలు తెలిపారు. కొందరు ఆ క్షణాలను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోగా, అవి క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు పోలీస్ విధిని సమానంగా నిర్వర్తించిన జయశాంతి అందరి మనసులను గెలుచుకున్నారు. బిడ్డను చంకలో పెట్టుకుని విధులు నిర్వహించిన ఆమె తీరు, రణరంగంలో బిడ్డను బుజానికి కట్టుకుని యుద్ధం చేసిన రాణి రుద్రమదేవిని గుర్తు చేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.



