విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చగా మారింది. “అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుంది” అన్న సామెతను సరిగ్గా తలపించేలా, సాధారణంగా కనిపించే ఓ కాకి… ఒకానొక కుటుంబానికి పెద్ద నష్టాన్ని మిగిల్చింది.
కార్తీకమాసం పూజలు – తులసి కోటలో వెలిగించిన దీపం
గరివిడి మండలం, కోనూరు గ్రామంలోని ఓ ఇంటి డాబాపై కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించి పూజలు పూర్తిచేసి ఇంటి పెద్దలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఏ జంతువు, పక్షి దగ్గరకు వచ్చినా పెడచెవిన పెట్టినా, ఈసారి మాత్రం అనూహ్య పరిస్థితి చోటుచేసుకుంది.
కాకి ఎత్తుకెళ్లిన కార్తీక దీపం… పక్కనే ఉన్న గుడిసెలపై పడగా ఘోరం
పూజలు పూర్తయ్యాక కొంతసేపటికి అక్కడికి వచ్చిన ఒక కాకి, తులసి కోటలో వెలిగించిన ఆ దీపాన్ని తన గిట్టతో ఎత్తుకుని ఎగిరిపోయింది. అలా ఎత్తుకెళ్లిన దీపాన్ని పక్కనే ఉన్న ఓ తాటాకు ఇల్లు పైన పడేసింది. క్షణాల్లో ఆ గుడిసెకు మంటలు అంటుకున్నాయి. తరువాతి క్షణాల్లోనే ఆ మంటలు మరో మూడు తాటాకు ఇళ్లకు వ్యాపించాయి.
నంబూరి గోపి, రెడ్డి సాంబ, కొక్కెర మాలచ్చమ్మ, మహంతి లక్ష్మీలకు చెందిన నాలుగు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
పంట పెట్టుబడి డబ్బు, బంగారం కాలి బూడిద
అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే నష్టం చాలా ఎక్కువైంది.
కౌలు రైతు నంబూరి గోపి రాబోయే రబీ పంటకు పెట్టుబడిగా లక్ష రూపాయలు అప్పు తెచ్చి ఇంట్లో పెట్టి ఉంచాడు. ఆ డబ్బు పాటు ఇంట్లో ఉన్న అర తులం బంగారం కూడా అగ్నికి ఆహుతైంది.
తాసిల్దారు సిహెచ్ బంగారు రాజు సంఘటన స్థలాన్ని సందర్శించి, మొత్తం ఆస్తి నష్టం సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉన్నట్లు అంచనా వేశారు.



