సిల్క్ స్మిత పేరు వినగానే గ్లామరస్ పాటలు గుర్తుకు వస్తాయి. కానీ ఆమెకు చాలా ముందే గ్లామర్ సాంగ్స్‌తో దక్షిణ భారత సినీ పరిశ్రమను శాసించిన ఓ లెజెండరీ నటి ఉన్నారని చాలామందికి తెలియదు. ఆమే జ్యోతిలక్ష్మి. ఒకప్పుడు ఆమె పేరు చెప్పగానే థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యేవి. డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ నటి, స్పెషల్ సాంగ్స్‌కు ట్రెండ్‌ను సెట్ చేసింది.
ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేయడానికి స్టార్ హీరోయిన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్న కాలంలో, అప్పట్లోనే జ్యోతిలక్ష్మి ఈ ట్రెండ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. జయమాలిని, సిల్క్ స్మిత లాంటి గ్లామర్ క్వీన్స్‌కు ముందే ఆమె పేరు మార్మోగింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తన నృత్యాలతో కుర్రకారును ఊర్రూతలూగించింది.
1948 నవంబర్ 2న తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించిన జ్యోతిలక్ష్మిని, ఆమె మేనత్త, నటి ఎస్‌పీఎల్ ధనలక్ష్మి చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. ఐదేళ్ల వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టిన ఆమె, ఎనిమిదేళ్లకే శివాజీ గణేశన్ నటించిన ‘కార్తవరాయన్ కథ’లో స్పెషల్ డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 1963లో ‘పెరియ ఇడత్తు పెణ్’ సినిమాతో నటిగా పరిచయమైంది.
తెలుగులో 1967లో ‘పెద్దక్కయ్య’ సినిమాతో అడుగుపెట్టిన జ్యోతిలక్ష్మి, 1973లో శోభన్ బాబు నటించిన ‘ఇదాలోకం’ సినిమాలోని ‘గుడి ఎనక నా సామి’ పాటతో సంచలనం సృష్టించింది. ఆ పాటతో ఆమె గ్లామర్ స్టార్‌గా స్థిరపడింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 1000కి పైగా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అంతేకాదు, 300కి పైగా సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటిగా కూడా గుర్తింపు పొందింది.
అయితే తెరపై అంతటి వెలుగు వెలిగించిన జ్యోతిలక్ష్మి వ్యక్తిగత జీవితం మాత్రం కష్టాలతో నిండిపోయింది. కెరీర్ పీక్‌లో ఉండగానే వాసుదేవన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ అతడికి అప్పటికే పెళ్లి ఉండటంతో ఈ బంధం సమస్యల పాలైంది. తరువాత విడిపోయి సినిమాటోగ్రాఫర్ సాయి ప్రసాద్‌ను వివాహం చేసుకుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆమెకు తీవ్ర నష్టాలు వచ్చాయి.
చివరి రోజుల్లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన జ్యోతిలక్ష్మి తీవ్ర అనారోగ్యంతో పోరాడింది. ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన ఈ గ్లామర్ క్వీన్, చివరికి అనేక కష్టాలను ఎదుర్కొని 2016 ఆగస్టు 9న తుదిశ్వాస విడిచింది. అయినా ఆమె చేసిన సినిమాలు, పాటలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగానే ఉన్నాయి.



