ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర అనన్యసామాన్యం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు మీడియా ‘నాలుగో స్థంభం’గా ప్రజలకు–ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తోంది. ఈ గౌరవస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే, వార్తా రచనలో వాడే భాష, పదజాలం, శైలిపై జర్నలిస్టు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ‘ఫోర్త్ ఎస్టేట్’ హోదాకు తగ్గట్టుగా వార్తలు, కథనాలు, విశ్లేషణలు రచించే సందర్భంలో వాడకూడని పదాలు–పద్ధతులపై స్పష్టమైన సూచనలు ఇవి.
(1) ‘శ్రీ’ అనే పదం
ఇటీవలి కాలంలో కొంతమంది జర్నలిస్టులు వార్తల్లో వ్యక్తుల పేర్ల ముందు ‘శ్రీ’ పదాన్ని చేర్చడం పెరిగింది. డెస్క్ దశలో కూడా ఇవి పట్టించుకోకుండా ప్రచురితమవుతున్నాయి.
జర్నలిస్టు ఎప్పటికీ ఎవరిపేరుకూ ‘శ్రీ’ అనే గౌరవపదాన్ని జోడించకూడదు.
(2) శ్రీమతి, గారు, సార్, మేడం, గౌరవనీయులు తదితర పదాలు
శ్రీమతి, మేడం, గారు, సార్, గౌరవనీయులు, మంత్రివర్యులు, పూజ్యులు, మాత్యులు వంటి గౌరవ సూచక పదాలు జర్నలిస్టుల రచనలో అనవసరం. వార్తలో గౌరవం కాదు, వాస్తవం ముఖ్యం.
(3) ‘మరియు’ అనే పదం
ముగింపు వాక్యం వద్ద అనవసరంగా ‘మరియు’ వాడటం వాక్య నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. పాఠకుడు రచయిత మరో అంశాన్ని కలపబోతున్నారేమో అన్న భావనకు లోనవుతాడు.
స్పష్టమైన, నిక్కచ్చి వాక్య నిర్మాణం జర్నలిస్టు గుర్తింపు.
(4) ‘నాడు’, ‘నేడు’, ‘ఈ రోజు’ వంటి పదాలు
వార్తల భద్రపరిచే సంప్రదాయం దృష్ట్యా ఇలా వాడటం తప్పుదోవ పట్టించవచ్చు.
ఉదాహరణకు, ‘‘నేడు’’ అని వార్తలో రాస్తే, పాఠకుడు ఏ రోజున చదివినా ‘నేడు’ని అదే రోజు జరిగిన సంఘటనగా భావించే ప్రమాదం ఉంది.
తేదీని స్పష్టంగా పేర్కొనడం ఉత్తమం.
(5) పేరుకు తరువాత IAS / IPS అని రాయకూడదు
అధికారుల హోదాను పేరుకు తరువాత రాయడం తప్పు. జర్నలిజంలో హోదా పేరు ముందు రాయడం సరైన పద్ధతి.
ఉదా: జిల్లా కలెక్టర్ రవి కుమార్ తెలిపారు…
అని రాయాలి; రవి కుమార్, IAS అని రాయకూడదు.
(6) ‘చోటుచేసుకుంది’ అనే పదం
‘‘చోటుచేసుకుంది’’ అనేది అనవసరంగా భారమైన పదం.
సులువు, సరైన పదం — ‘‘జరిగింది’’
(7) ‘వివరాల్లోకి వెళితే’ అనకుండా…
వార్తా రచనలో ‘‘వివరాల్లోకి వెళితే’’కి బదులుగా
‘‘వివరాలు ఇలా ఉన్నాయి’’
అని రాయాలి.
(8) యంయల్‌ఏ కాదు – ఎంఎల్‌ఏ / ఎమ్మెల్యే
శబ్దోచ్చారణ ఆధారంగా ‘యంయల్‌ఏ’ అని రాయడం తప్పు.
సరైన రూపం: MLA / ఎమ్మెల్యే
(9) యంపీటీసీ కాదు – ఎంపీటీసీ
సరైన రూపం: MPTC / ఎంపీటీసీ
(10) యంపీపీ కాదు – ఎంపీపీ
సరైన రూపం: MPP / ఎంపీపీ
(11) తేది 11.05.2022 అని రాయకూడదు
అంకెల రూపంలో తేదీ రాయడం పాఠకుడిలో గందరగోళం కలిగిస్తుంది.
సరైన రీతీ:
2022 మే 11న
(12) వార్తల్లో ఇంగ్లీషు అక్షరాలు అవసరం లేనప్పుడు రాయకూడదు
తెలుగు వార్తలో అనవసరంగా ఇంగ్లీషు అక్షరాలు చేర్చడం ప్రమాణిత రచనా విధానానికి విరుద్ధం.
(13) ‘పేర్కొన్నారు’ అనే పదం వినియోగం
‘పేర్కొన్నారు’ అనేది ప్రెస్ నోట్లకు మాత్రమే సరిపోయే పదం.
సభలు, సమావేశాలు, ప్రసంగాల వార్తల్లో ఇది వాడటం పద్ధతి కాదు.
(14) తెలిపారు, చెప్పారు, అన్నారు, వెల్లడించారు
ఈ ముగింపు పదాలను సందర్భం అనుసరించి వాడాలి.
ఒకే పదాన్ని పదేపదే ఉపయోగించడం వార్తను యాంత్రికంగా అనిపిస్తుంది.



