గుంటూరు:
కోవిడ్ సమయంలో నిలిపివేసిన రైల్వే రాయితీ పాస్‌లను తిరిగి అమలులోకి తీసుకురావాలన్న డిమాండ్ గళం ఎత్తుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) మరియు బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (APBJA) ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌ను గుంటూరు జిల్లా క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులతో మాట్లాడిన మంత్రి పెమ్మసాని, “రైల్వే పాస్‌ల పునరుద్ధరణ అంశాన్ని తప్పకుండా పార్లమెంటులో ప్రస్తావిస్తాను. వాటిని మళ్లీ అమలులోకి తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను,” అని హామీ ఇచ్చారు.
వినతిపత్రంలో పేర్కొన్న విషయాల ప్రకారం,
- గ్రామీణ మరియు ప్రాంతీయ స్థాయిలో పనిచేస్తున్న పత్రికా విలేకర్లకు రైలు ప్రయాణం అనివార్యం.
- రాయితీ పాస్‌లు ఉండటం వల్ల ప్రయాణ ఖర్చులు తగ్గి, మరింత సమాచారం సేకరణకు వీలు కలుగుతుంది.
- ప్రజలకు నాణ్యమైన, సమగ్ర సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ క్రమంలో రాయితీ పాస్‌ల పునరుద్ధరణ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ సమగ్ర దృష్టిని ప్రతిబింబిస్తుందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
క్యాంపు కార్యాలయంలో కలిసిన ప్రతినిధులు:
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు బోస్క సువర్ణబాబు, జనరల్ సెక్రటరీ కేశంసెట్టి శ్రీనివాస్, పొనుగుబాటి నాగరాజు, మోపర్తి సువర్ణరాజు, యదనపుడి ఆరుద్ర, గాజుల బ్రహ్మం, బిరుదుల రాజేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు.



