ప్రస్తుత సమాజంలో కొందరు వ్యక్తులు జర్నలిస్టుల పట్ల ప్రదర్శించే ప్రవర్తన ఆశ్చర్యకరంగా ఉంది. ముఖ్యంగా నూతన విలేకరులు, గ్రామీణ రిపోర్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా స్ట్రింగర్లు పట్ల కొందరు తక్కువ చూపుతో మాట్లాడటం, అవమానకరంగా ప్రవర్తించడం నిత్యకృత్యమైపోయింది. “మీరు జర్నలిస్టా?”, “మీరు పంపే వార్తలు ఎప్పుడైనా పేపర్లో వచ్చాయా?”, “మీరు పంపిన వీడియో ఏదైనా టీవీలో ప్రసారమైందా?” వంటి ప్రశ్నలతో విలేకరులను అవమానించడం కొందరి అలవాటుగా మారింది.
ఇక కొందరు మరీ ముందుకెళ్లి, “మా పత్రిక స్టాఫ్ రిపోర్టర్ నాకు బాగా తెలుసు”, “ఒక్కసారి అడిగానని చెప్పు” అంటూ అహంకారంగా ప్రవర్తిస్తారు. ఊర్లో పెళ్లికి వచ్చిన కుక్కల గుంపు హడావుడిలా ప్రవర్తించే ఈ వ్యక్తులు, జర్నలిస్టుల పట్ల గౌరవం చూపడం మరిచిపోయారు. అయినా జర్నలిస్టు తన కర్తవ్యాన్ని మరిచిపోకూడదు. “డోంట్ కేర్ – మన పని మనదే” అనే ధైర్యం జర్నలిస్టు మనసులో ఉండాలి.
ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు గ్రామీణ జర్నలిస్టులు, స్ట్రింగర్లు వెనుకడుగు వేయకూడదు. బదులుగా “అవును, నేను స్ట్రింగర్‌ని. పార్ట్ టైమ్‌గా వార్తలు రాస్తాను, రికార్డ్ చేస్తాను. ప్రచురించాలా, ప్రసారం చేయాలా అనేది డెస్క్ నిర్ణయం. నా బాధ్యత వార్తను పంపడమే” అని ధైర్యంగా సమాధానం ఇవ్వాలి. ఆ విధంగా మాట్లాడిన జర్నలిస్టును ఇక మళ్లీ ఎవరూ అవమానించడానికి ధైర్యం చేయరు.
తరువాత, జర్నలిజం రంగంలో కొత్తగా అడుగుపెడుతున్న వారు కూడా అణకువగా ఉండటం అవసరం కానీ, అవమానాల ముందు మౌనంగా కూర్చోవడం సరైంది కాదు. మౌనం కూడా ఒక రకంగా ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. జర్నలిజం అంటే ప్రశ్నించడం, సమాధానాలు రాబట్టడం, సత్యాన్ని వెలికితీయడం. అందుకు ధైర్యం, ఓర్పు, నేర్పు తప్పనిసరి.
జర్నలిజం అనేది కేవలం వృత్తి కాదు, ఇది ఒక సామాజిక బాధ్యతతో కూడిన ఛాలెంజింగ్ ప్రొఫెషన్. అందువల్ల జర్నలిస్టు తగిన మర్యాద చూపుతూ, ఎదురుగా ఉన్న వారి మాట వింటూ, తగిన సమాధానం ఇస్తూ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి.
దురదృష్టవశాత్తూ, నేటి రోజుల్లో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా కొత్తగా వచ్చిన వారిని కించపరుస్తూ, “నీ పేరు తెలుగులో రాయగలవా?” అని అడిగే పరిస్థితి ఉంది. ఈ దుస్థితి మారాలంటే, జర్నలిస్టుగా ఎదగదలచిన ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, ధైర్యం అనే మూడు మూల స్తంభాలు తప్పనిసరిగా ఉండాలి.
జర్నలిజం అనేది ప్రజల కోసం, సమాజం కోసం పనిచేసే పుణ్యమైన వృత్తి. దాన్ని గౌరవంగా నిలబెట్టడం ప్రతి విలేకరి ధర్మం.



