జర్నలిజం విలువలు క్షీణిస్తున్నాయా? ప్రతి జర్నలిస్టు తప్పక తెలుసుకోవాల్సిన నైపుణ్యాలు

ప్రస్తుతం మీడియా రంగంలోకి అడుగుపెడుతున్న కొందరి కారణంగా విలువలు మాత్రమే కాకుండా, జర్నలిజం స్వరూపమే మసకబారుతున్నదనే భావన బలంగా కనిపిస్తోంది. మీడియా విలువల పతనమే కాదు, ఒక జర్నలిస్టుకు తప్పనిసరిగా ఉండాల్సిన మౌలిక అవగాహన, శిక్షణ, నైపుణ్యాల పట్ల కూడా నిర్లక్ష్యం పెరుగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలు అందరినీ ఉద్దేశించినవని కాదు. జర్నలిజం నైపుణ్యాలు సీనియర్ జర్నలిస్టులకు తెలియనివి కూడా కావు. కానీ ముఖ్యంగా నూతనంగా జర్నలిజంలోకి వస్తున్నవారు, ఇప్పుడిపుడే పత్రికలు, టీవీ చానళ్లు, డిజిటల్ మీడియాకు వార్తలు రిపోర్ట్ చేస్తున్నవారు ఈ మౌలిక నైపుణ్యాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇవి వారి రిపోర్టింగ్ స్థాయిని గణనీయంగా మెరుగుపరచడంలో కీలకంగా నిలుస్తాయి.

జర్నలిజం నైపుణ్యాలను సంపూర్ణంగా అలవర్చుకున్న జర్నలిస్టులు, హోదాల పరిమితులను దాటి తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించగలుగుతారు. ఇందుకు తెలుగు మీడియారంగంలో పనిచేసే ప్రతి జర్నలిస్టు తెలుగు భాషపై పట్టు, జర్నలిజం మౌలిక సూత్రాలపై అవగాహన, వృత్తిపరమైన నైపుణ్యాలను తప్పనిసరిగా పెంపొందించుకోవాలి. జర్నలిస్టు నైపుణ్యం ఎంత దృఢంగా ఉంటే, మీడియా రంగంలో అతడి స్థానం అంత బలంగా నిలుస్తుంది.

తెలుగు మీడియారంగంలో సాధారణంగా కనిపించే విలేఖరి హోదాలు ఇవి:

  1. విలేఖరి (Reporter)
  2. ప్రత్యేక విలేఖరి (Special Reporter)
  3. స్థానిక విలేఖరి (Local Reporter)
  4. నగర విలేఖరి (City Reporter)
  5. గ్రామీణ విలేఖరి (Rural Reporter)
  6. జనపద విలేఖరి (Mofussil Reporter)

విలేఖరి (Reporter):
నిర్దిష్ట ప్రాంతంలో లేదా నియమిత అంశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పత్రికకు లేదా మీడియా సంస్థకు అందించే ఉద్యోగిని విలేఖరి అంటారు.

ప్రత్యేక విలేఖరి (Special Reporter):
అనుభవం, నైపుణ్యం, విశ్వసనీయత ఆధారంగా ఒక విలేఖరికి ప్రత్యేక విభాగం అప్పగించినప్పుడు అతడిని ప్రత్యేక విలేఖరిగా గుర్తిస్తారు.

స్థానిక విలేఖరి (Local Reporter):
గ్రామం లేదా నగరంలోని చిన్న పరిధిలో వార్తా సేకరణ చేసే విలేఖరి.

నగర విలేఖరి (City Reporter):
నిర్దేశిత నగర పరిధిలో జరిగే సంఘటనలు, పరిణామాలను కవర్ చేసే విలేఖరి.

గ్రామీణ విలేఖరి (Rural Reporter):
గ్రామీణ ప్రాంతాల్లో సంచారం చేస్తూ, అక్కడి సమస్యలు, సంఘటనలపై వార్తలు సేకరించే విలేఖరి.

జనపద విలేఖరి (Mofussil Reporter):
రాజధాని కాకుండా, పట్టణాలు–గ్రామాల మధ్య ప్రాంతాల నుంచి వార్తలు సేకరించే విలేఖరిని జనపద విలేఖరి అంటారు. పత్రిక అవసరాలు, వ్యాప్తి, వనరుల ఆధారంగా యాజమాన్యాలు భిన్న నామధేయాలతో విలేఖరులను నియమిస్తుంటాయి.

విలేఖరి ప్రధాన బాధ్యత వార్తా సేకరణే అయినా, సేకరించిన సమాచారాన్ని సరిగా నివేదికగా రూపొందించి, శీర్షికతో సహా కార్యాలయానికి పంపడం కూడా అతడి కర్తవ్యమే. అవసరాన్ని బట్టి ప్రసంగాలను రికార్డు చేయడం, ఫోటోలు తీయడం లేదా తీయించడం కూడా విలేఖరి బాధ్యతలో భాగమే. ఏ రోజు, ఎక్కడ, ఎవరి ప్రసంగాన్ని ఎంతసేపు రికార్డు చేశాడో, ఫోటోల్లో ఉన్న వ్యక్తుల పేర్లు, స్థల వివరాలు వంటి అంశాలను దినచర్య (డైరీ)లో నమోదు చేసి, నివేదికతో పాటు పంపాలి.

విలేఖరి నైపుణ్యం – తప్పనిసరి జాగ్రత్తలు

  1. భేటీకి ముందే సేకరించాల్సిన సమాచారంపై అవగాహన కలిగి, ప్రశ్నలను ముందుగా సిద్ధం చేసుకోవాలి.
  2. తన పరిధిలోని కార్యాలయాలు, సంస్థలు, ప్రముఖ వ్యక్తులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
  3. వాస్తవాలను మాత్రమే సేకరించాలి. ఒకే మూలంపై ఆధారపడకుండా విస్తృతంగా సమాచారం తెచ్చుకోవాలి.
  4. లభించిన వివరాల్లో ఏది ప్రధానమో, ఏది ఉప అంశమో గుర్తించి ప్రాధాన్య క్రమంలో నివేదిక రూపొందించాలి.
  5. భేటీ సమయంలో అతిగా మాట్లాడకూడదు, అతి మౌనంగా కూడా ఉండకూడదు. ప్రశ్నలు స్పష్టంగా, మర్యాదగా వేయాలి.
  6. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నా భేటీని అకస్మాత్తుగా మధ్యలో వదిలేయకూడదు.
  7. లభించిన సమాచారాన్ని ఇతర ఆధారాలతో ధృవీకరించకుండా నివేదిక పంపకూడదు.
  8. భిన్నాభిప్రాయాలు ఉన్న అంశాలైతే అన్ని కోణాలు సేకరించాలి.
  9. ప్రతి వార్తకు ఆధారం స్పష్టంగా ఉండాలి. పేరు గోప్యంగా ఉంచాలని కోరినవారి విషయంలో రహస్యాన్ని కాపాడాలి.
  10. వివాదాస్పద అంశాలైతే, మరిన్ని అభిప్రాయాలు లభించే అవకాశాలను కార్యాలయానికి తెలియజేయాలి.
  11. ఇతర పత్రికలు లేదా వార్తా సంస్థల నుంచి లభించిన అదనపు సమాచారాన్ని కూడా కార్యాలయానికి పంపాలి.

నైపుణ్యంతో కూడిన రిపోర్టింగ్

సేకరించిన సమాచారాన్ని నివేదికగా రూపొందించేటప్పుడు ప్రతి వార్తకు ఒక ఆధారం తప్పనిసరిగా ఉండాలని జర్నలిస్టు గ్రహించాలి. వ్యక్తి లేదా సంస్థ ద్వారా వచ్చిన సమాచారం స్పష్టంగా గుర్తించగలిగితే దాన్ని స్పష్టాధారంగా పేర్కొనాలి. కొన్ని సందర్భాల్లో పేరు వెల్లడించలేని పరిస్థితుల్లో కింది విధంగా వార్తాధారాన్ని సూచించాలి:

– అధికార వర్గాల ద్వారా
– సమర్థవర్గాల ద్వారా
– సన్నిహిత వర్గాల ద్వారా
– అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా
– అభిజ్ఞ వర్గాల ద్వారా
– పరిశీలకుల సమాచారం ప్రకారం

ఏ ఆధారమూ లేని వార్తను పాఠకుడు నమ్మడు. నమ్మకం లేని వార్త జర్నలిజానికి విలువ ఇవ్వదు. ఈ సత్యాన్ని ప్రతి జర్నలిస్టు గాఢంగా గుర్తుంచుకోవాలి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి