జర్నలిజం అంటే సమాజాన్ని మార్చే శక్తి. చెడును ప్రశ్నించే ధైర్యం. కానీ ఈ ప్రశ్నించే తత్వం అందరిలో ఉందా..? అంటే చాలా కొద్దిమందిలో మాత్రమే ఉంది. ఎందుకంటే, “ప్రశ్న” అనే పదం స్వయంగా జర్నలిజం యొక్క హృదయం. సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, దోపిడీలను ప్రశ్నించి — వాటికి సమాధానం తీసుకురావడమే నిజమైన జర్నలిజం. అంటే “నిజం చెప్పడం” జర్నలిజం యొక్క ప్రాణం.
అయితే ఈ రోజుల్లో ఆ ప్రాణం మసకబారిపోయింది. ఎందుకంటే ప్రజల వాయిస్ వినిపించాల్సిన మీడియా ఇప్పుడు వారి పక్షాన నిలవడం మరిచిపోయింది. న్యాయం కోసం కేకలు వేస్తున్న బలహీన వర్గాలు, పీడితులు, బాధితులకు సాయం చేయాల్సిన మీడియా… ఇప్పుడు వారిని వదిలి లాభాల కోసం పరుగులు తీస్తోంది. నిజం చెప్పే బదులు, బూతులు తిట్టే స్థాయికి దిగజారింది.
జర్నలిజం అంటే నిజం. ఆ నిజాన్ని బయటకు తీయడం కోసం “ప్రశ్న” జర్నలిస్టుల ప్రధాన ఆయుధం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ఇప్పుడు ఆ హక్కు వినియోగించే ధైర్యం కనిపించడం లేదు. ఎందుకంటే మీడియా అనే నాలుగవ స్తంభం తన బాధ్యతను మరిచిపోయింది. ఒకప్పుడు చెడును బహిర్గతం చేసిన ఈ రంగం ఇప్పుడు తనే చెడులో మునిగిపోయింది.
ఇప్పటి కొత్త జర్నలిస్టులు పరిశోధనాత్మక దృష్టితో సమాజాన్ని చూడటం మరిచిపోయారు. ఎవరో ఇచ్చిన సమాచారం మాత్రమే నమ్మి కూర్చున్నారు. వీరివల్లే పరిశోధనాత్మక జర్నలిజం మరణించింది. ప్రశ్నించాల్సిన కలాలు ఇప్పుడు అద్దె రాతలుగా మారిపోయాయి. సొంత ప్రయోజనాల కోసం కలాలు అమ్ముకుపోయాయి. ప్రజల ప్రయోజనాలకోసం రాయాల్సిన కలాలు విషం చిమ్ముతున్నాయి.
మీడియా నిఘానేత్రాలు మూసుకుపోతే దేశ సంపద, అడవి సంపదలు, వనరులు అంతర్జాతీయ స్థాయిలో దోపిడీకి గురవుతున్నా ఎవరు ప్రశ్నించడం లేదు. ఎందుకంటే ఆ గొంతులు ఇప్పుడు సైలెంట్ అయ్యాయి. కట్టుకథలు రాసే పెట్టుబడిదారుల పత్రికలు, ఛానల్స్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అవి చెబుతున్నదే ‘నిజం’ అని ప్రజలు నమ్మేలా చేస్తూ, నిజం – అబద్ధం మధ్య తేడాను కూడా గుర్తించలేని పరిస్థితి సృష్టించాయి.
నిజం చెప్పే జర్నలిజం ఎప్పటికీ చనిపోదు. కానీ ఆత్మవంచన చేసే శక్తులు దానిని దెబ్బతీస్తాయి. ఇప్పుడు కొందరి జర్నలిస్టుల కెమెరాలు వాస్తవాలను చూపలేవు. మైకులు నిజాలను పలకలేవు. ఎందుకంటే అవి సత్యం కోసం కాకుండా స్వార్ధం కోసం పని చేస్తున్నాయి. విలువలతో ఉన్న జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. పత్రికా సంస్థలు పెట్టుబడిదారుల బానిసలుగా మారిపోయాయి.
జర్నలిజం అంటే నిజం చెప్పే బాధ్యత. డబ్బు కోసం కట్టుకథలు రాసే వారు జర్నలిస్టులు కాదు. నిజం కోసం కలం పట్టినవారే నిజమైన జర్నలిస్టులు. సమాజం మంచిని ప్రోత్సహిస్తే, నిజం చెప్పే జర్నలిజం మళ్లీ బ్రతుకుతుంది. “నిజాలను నిజాలుగానే, అబద్ధాలను అబద్ధాలుగానే” రాసే జర్నలిస్టులే జర్నలిజం మళ్లీ పునర్జన్మ పొందేలా చేస్తారు.
ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజం – ఏది అబద్ధం అని తెలుసుకోవడం వారి బాధ్యత. ప్రజలు నిజం చెప్పే మీడియాను ఆదరిస్తే మాత్రమే విలువలతో ఉన్న జర్నలిజం బ్రతుకుతుంది.
జర్నలిజం ఎప్పటికీ తప్పుకాదు. తప్పు దాని పేరుతో దాగి ఉన్న కొద్ది మంది శక్తులదే. వారు మారితే, నిజమైన జర్నలిజం మళ్లీ వెలుగులోకి వస్తుంది.



