కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన చిన్నారి జెస్సీ విద్యను ఆపేసి పత్తి చేలో కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో సీటు దొరకకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి కోసం వలస కూలీలుగా తెలంగాణకు వెళ్లారు. చదవాలన్న తపన ఉన్నప్పటికీ పరిస్థితులు సహకరించకపోవడంతో జెస్సీ కలలు గాలిలో కలిసిపోయాయి. అయితే ఈ విషయం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లగానే, వెంటనే స్పందించి జెస్సీకి మళ్లీ విద్యను కొనసాగించే అవకాశాన్ని కల్పించారు.
జెస్సీ ఒక నిరుపేద దళిత కుటుంబానికి చెందినది. సొంత వ్యవసాయ భూమి లేకపోవడం, గ్రామంలో ఐదో తరగతి దాటి ఉన్న పాఠశాల లేకపోవడం వల్ల విద్య ఆగిపోవాల్సి వచ్చింది. ఐదో తరగతి పూర్తి చేసిన తరువాత, చిలకలడోణ కేజీబీవీలో ఆరో తరగతిలో చేర్పించేందుకు ఆమె తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నా సీటు రాలేదు. జిల్లా అధికారులను పలుమార్లు కలిసినా ఫలితం లేకపోవడంతో చివరికి కుటుంబం వలస వెళ్లిపోయింది.
ఈ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. జెస్సీకి కేజీబీవీ సీటు కల్పిస్తానని హామీ ఇచ్చి, ‘‘పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చిన్నారి చేతులు పత్తి చేలో కష్టపడటం బాధాకరం. చిట్టి తల్లి నిశ్చింతగా చదువు కొనసాగించు, నీకు సీటు ఇప్పించడం నా బాధ్యత’’ అని ట్వీట్ చేశారు.
అలాగే తల్లిదండ్రులను ఉద్దేశించి లోకేశ్ పిలుపునిస్తూ, పిల్లలను బడికి పంపితే ప్రభుత్వం ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, మధ్యాహ్న భోజనం అందిస్తుందని వివరించారు. ‘‘విద్యలోనే పిల్లల భవిష్యత్తు ఉంది. బడిలోనే భద్రత ఉంది’’ అని తల్లిదండ్రులకు స్పష్టం చేశారు.
ఇంతకు ముందు కూడా లోకేశ్ అనేక మంది విద్యార్థులను, గల్ఫ్ బాధితులను ఆదుకున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక కుటుంబాలకు సహాయం చేశారు. ఇప్పుడు జెస్సీ జీవితంలో విద్యకు కొత్త ఆరంభం లోకేశ్ చర్యలతో సాధ్యమైంది.



