జేఈఈ మెయిన్‌ 2026 రెండో సెషన్‌కు దరఖాస్తులు ప్రారంభం

ఏప్రిల్‌ 2 నుంచి పరీక్షలు – ఏప్రిల్‌ 20 నాటికి ఫలితాలు

జేఈఈ మెయిన్‌–2026 రెండో దశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తొలి దశ పరీక్షలు విజయవంతంగా పూర్తవడంతో, రెండో సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్లను ఫిబ్రవరి 1 నుంచి 25వ తేదీ రాత్రి 9 గంటల వరకూ ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.

రెండో సెషన్‌కు సంబంధించిన జేఈఈ మెయిన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9వ తేదీ మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. పరీక్ష కేంద్రాల వివరాలతో కూడిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లు, అలాగే హాల్‌ టికెట్లు నిర్ణీత సమయంలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. రెండో విడత ఫలితాలను ఏప్రిల్‌ 20 నాటికి ప్రకటించే అవకాశముందని అధికారులు తెలిపారు.


దరఖాస్తు విధానం ఇలా ఉంటుంది…

తొలి సెషన్‌ జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా రెండో సెషన్‌కు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం సెషన్‌-1లో ఉపయోగించిన అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ కావాలి. లాగిన్‌ అయిన తర్వాత పేపర్‌ ఎంపిక, పరీక్ష మాధ్యమం, పరీక్ష రాయదలచుకున్న నగరం, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను పరిశీలించి నిర్ధారించాలి. అనంతరం పరీక్ష ఫీజు చెల్లిస్తే దరఖాస్తు పూర్తవుతుంది. కొత్తగా అదనపు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.

మొదటిసారి జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేస్తున్న విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్‌తో పాటు అందించిన సమాచార పుస్తికను జాగ్రత్తగా చదివి, అందులో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని ఎన్‌టీఏ సూచించింది. ఒక అభ్యర్థి ఒక్క అప్లికేషన్‌ మాత్రమే సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


పేపర్ల వివరాలు…

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు (NITs), ట్రిపుల్‌ ఐటీలు (IIITs), ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల్లో బీటెక్‌ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ పేపర్‌–1 నిర్వహిస్తారు. బీ ఆర్కిటెక్చర్‌ కోర్సులకు పేపర్‌–2ఏ, బీ ప్లానింగ్‌ కోర్సులకు పేపర్‌–2బీ పరీక్షలు ఉంటాయి. రెండు సెషన్లకు హాజరైన అభ్యర్థులలో ఉత్తమ స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని తుది ర్యాంకులను ప్రకటిస్తారు.


జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత ఇదే…

తొలి విడత జేఈఈ మెయిన్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా 13 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జేఈఈ మెయిన్‌లో అర్హత మార్కులు సాధించిన దాదాపు రెండున్నర లక్షల మంది అభ్యర్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధించిన వారికి జోసా (JoSAA) కౌన్సెలింగ్‌ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.


హెల్ప్‌డెస్క్‌ వివరాలు…

జేఈఈ మెయిన్‌ దరఖాస్తు సమయంలో సాంకేతిక లేదా ఇతర సమస్యలు ఎదురైతే 011-40759000, 011-69227700 హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే jeemain@nta.ac.in కు ఈమెయిల్‌ పంపి కూడా వివరాలు తెలుసుకోవచ్చని ఎన్‌టీఏ తెలిపింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి