నూతన సంవత్సర ఆరంభ వేళ జపాన్‌ను మరోసారి భూకంపం కుదిపేసింది. దేశ తూర్పు భాగంలోని నోడా నగరంలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. నోడా నగరానికి తూర్పుగా సుమారు 91 కిలోమీటర్ల దూరంలో, భూమికి 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియాలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించిందా అనే వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
ఇటీవల కాలంలో జపాన్‌లో భూకంపాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 8వ తేదీన జపాన్ తూర్పు తీరంలో రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించగా, పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అనంతరం డిసెంబర్ 12న మరోసారి 6.7 తీవ్రతతో భూమి కంపించడం గమనార్హం. తాజా భూకంపంతో అధికారులు అప్రమత్తమయ్యారు.



