సాధారణంగా పెళ్లి ఆహ్వాన పత్రికలు అంటే కాగితంపై ముద్రించినవి లేదా డిజిటల్ కార్డులే మనకు గుర్తొస్తాయి. కానీ రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చెందిన ఓ తండ్రి మాత్రం తన కూతురు వివాహాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలనే తపనతో అందరికీ ఆశ్చర్యం కలిగించే వినూత్న ఆలోచనకు రూపం ఇచ్చారు. పూర్తిగా వెండితో తయారు చేసిన అరుదైన పెళ్లి పత్రికను రూపొందించి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
ఏడాది పాటు శ్రమించి… 128 వెండి ముక్కలతో కళాఖండం
జైపూర్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి శివ్ జౌహరీ తన కుమార్తె శ్రుతి జౌహరీ వివాహానికి ప్రత్యేక గుర్తింపుండాలని భావించారు. అందుకే సుమారు మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో పెట్టె ఆకారంలో ఉండే విలాసవంతమైన ఆహ్వాన పత్రికను తయారు చేయించారు. ఈ ఒక్క వెండి కార్డు తయారీకే ఆయన సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఈ కళాఖండాన్ని పూర్తిచేయడానికి నిపుణులైన శిల్పకారులకు దాదాపు ఒక సంవత్సరం సమయం పట్టింది. ముఖ్యంగా ఎక్కడా మేకులు లేదా స్క్రూలు ఉపయోగించకుండా, కేవలం కళాత్మక నైపుణ్యంతోనే 128 వెండి ముక్కలను ఒకటిగా జోడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
65 దేవతా మూర్తుల సూక్ష్మ శిల్పాలు
ఈ వెండి పెళ్లి పత్రికను కేవలం ఆహ్వానంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక కళాఖండంగా తీర్చిదిద్దారు. కార్డు పైభాగంలో వినాయకుడి ప్రతిమ, కుడివైపు పార్వతి దేవి, ఎడమవైపు శివుడు, కింద భాగంలో లక్ష్మీ నారాయణుల రూపాలు దర్శనమిస్తాయి.
మొత్తంగా 65 మంది దేవతా మూర్తుల ప్రతిమలను అద్భుతమైన సూక్ష్మ శిల్పకళతో ఇందులో చెక్కారు. శ్రీకృష్ణుడి బాల్యలీలలు, విష్ణుమూర్తి దశావతారాలు, అష్టలక్ష్ముల రూపాలు, తిరుపతి బాలాజీ విగ్రహం వంటి అంశాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. కార్డు మధ్యభాగంలో వధూవరులైన శ్రుతి జౌహరీ, హర్ష్ సోనీ పేర్లు ఉండగా, వారి చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా చెక్కిన దృశ్యం సంపద, శుభం, ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
కూతురిపై తండ్రి ప్రేమకు ప్రతిరూపం
ఈ వినూత్న ప్రయత్నం గురించి శివ్ జౌహరీ మాట్లాడుతూ, “ఇది కేవలం పెళ్లి పత్రిక కాదు. ఒక తండ్రిగా నా కుమార్తెకు ఇచ్చే భావోద్వేగపూరిత కానుక. ఆమె వివాహానికి దేవతలందరి ఆశీస్సులు ఉండాలని ఈ రూపంలో తయారు చేయించాను. ఇది ఆమె జీవితాంతం మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది” అని తెలిపారు.
ఈ అరుదైన వెండి ఆహ్వాన పత్రికను ఆయన తన కాబోయే వియ్యంకుడికి అందజేశారు. ప్రస్తుతం ఈ ‘సిల్వర్ వెడ్డింగ్ కార్డ్’ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. జైపూర్ కళా సంప్రదాయానికి, ఒక తండ్రి అపారమైన ప్రేమకు ఇది నిలువెత్తు నిదర్శనమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



