అసెంబ్లీకి జగన్ హాజరు నిర్ణయం.. ఎదురుదాడికి సిద్ధమవుతున్న వైసీపీ

jagan-to-attend-ap-assembly-meetings-decides-to-confront-on-issues

2024 ఎన్నికల అనంతరం రాజకీయ దిశా మార్పులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు హాజరుకాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 11 సీట్లకే పరిమితమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగన్ అసెంబ్లీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెల 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సమావేశాల నిర్వహణపై త్వరలో అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది. సమావేశాలను దాదాపు పది రోజుల పాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఈ సందర్భంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలపై సభ వేదికగా ప్రజలకు వివరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. అమరావతి రాజధాని అంశాన్ని కూడా స్పెషల్ డిస్కషన్ కోసం ప్రస్తావించే అవకాశముంది. దీంతో పాటు కొన్ని కీలక బిల్లులు కూడా సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, గత కొన్ని నెలలుగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంది. మాజీ సీఎం జగన్ తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార సమయంలో గానీ, గవర్నర్ ప్రసంగ సమయంలో గానీ మాత్రమే హాజరయ్యారు. అనంతరం జరిగిన చర్చలన్నిటిలోనూ వైసీపీ గైర్హాజరైంది. అయితే, ఇటీవలి కాలంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, పార్టీ నేతలపై నమోదవుతున్న కేసులు, పోలీసులు చేస్తున్న అరెస్టులు వంటి అంశాలు జగన్ వ్యూహాన్ని మార్చేలా చేశాయని విశ్లేషణ.

తన పాలనలో జరిగినదిగా చెబుతున్న అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి అసెంబ్లీ వేదికను ఉపయోగించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా లిక్కర్ కేసుపై సభలో చర్చకు డిమాండ్ చేయాలని ఆయన నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ హయాంలోనే ఈ స్కాంలు జరిగాయని, తన హయాంలో అవే పునరావృతం కాలేదని జగన్ స్పష్టంగా వెల్లడించాలని భావిస్తున్నారట.

అదేవిధంగా, కూటమి ప్రభుత్వం అప్పులపై తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న హామీలు వంటి అంశాలపై వైసీపీ సభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో జగన్ స్వయంగా అసెంబ్లీకి హాజరై ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలతో అసెంబ్లీ వేదికపై రాజకీయ వేడి రాజుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ హాజరుతో సమావేశాలు ఉత్కంఠభరితంగా మారనున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి