రైలు ప్రయాణాల్లో చాలా మందికి తాత్కాలికంగా విశ్రాంతి తీసుకునే గది అవసరం అవుతుంది. ట్రైన్ ఆలస్యం కావడం, కనెక్టింగ్ రైలు కోసం ఎక్కువసేపు వేచిచూడాల్సి రావడం, లేదా స్టేషన్ సమీపంలో కొన్ని గంటలు గడపాల్సిన పరిస్థితుల్లో ప్రయాణికులు రూమ్ కోసం వెతుకుతుంటారు. అయితే బయట హోటళ్లలో గది తీసుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతాయి. ఏసీ, లగ్జరీ సౌకర్యాలు కావాలంటే ఖర్చు మరింత పెరుగుతుంది.
కానీ చాలా మందికి తెలియని ఒక సౌకర్యం భారతీయ రైల్వే అందిస్తోంది. అదే ‘రిటైరింగ్ రూమ్స్’. రైల్వే స్టేషన్లలోనే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఈ రూమ్స్‌లో కేవలం రూ.100 నుంచే లగ్జరీ సౌకర్యాలతో కూడిన గదులు అందుబాటులో ఉంటాయి. సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. ఈ రూమ్స్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులభంగా బుక్ చేసుకోవచ్చు.
రిటైరింగ్ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి..?
◆ ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
◆ ‘My Bookings’ విభాగంలోకి వెళ్లాలి
◆ మీరు బుక్ చేసుకున్న టికెట్ వివరాల కింద ‘Retiring Rooms’ అనే ఆప్షన్ కనిపిస్తుంది
◆ ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
◆ మీ పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి
◆ మీరు విశ్రాంతి తీసుకోవాలనుకున్న స్టేషన్‌ను ఎంచుకోవాలి
◆ చెక్-ఇన్, చెక్-అవుట్ సమయం, ఏసీ లేదా నాన్-ఏసీ వంటి వివరాలు నమోదు చేయాలి
◆ ఆ స్టేషన్‌లో రూమ్స్ ఖాళీగా ఉన్నాయా లేదా అన్న సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది
◆ ఖాళీగా ఉంటే మీకు నచ్చిన రూమ్‌ను సెలక్ట్ చేసి ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేయాలి
ధరలు మరియు సౌకర్యాలు ఎలా ఉంటాయంటే…
సాధారణంగా రిటైరింగ్ రూమ్స్ ధరలు రూ.100 నుంచి ప్రారంభమవుతాయి. అయితే స్టేషన్, ప్రాంతం, డిమాండ్‌ను బట్టి ఈ ధరలు గరిష్టంగా రూ.700 వరకు ఉండవచ్చు. సింగిల్ రూమ్, డబుల్ రూమ్, ఏసీ, నాన్-ఏసీ వంటి విభాగాల్లో గదులు అందుబాటులో ఉంటాయి.
ఈ రూమ్స్‌లో బెడ్, బాత్రూమ్, టీవీ, ఇంటర్నెట్ వంటి మౌలిక సౌకర్యాలు ఉంటాయి. ట్రైన్ ఆలస్యమైనప్పుడు, ప్రయాణాల మధ్య విరామంలో విశ్రాంతి తీసుకోవాలనుకునే ప్రయాణికులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. దాదాపు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రిటైరింగ్ రూమ్స్ సౌకర్యం ఉంది.
ఆన్‌లైన్ కాకుండా, అవసరమైతే స్టేషన్‌లోని రైల్వే సిబ్బందిని సంప్రదించి కూడా ఈ రూమ్స్‌ను పొందవచ్చు. తక్కువ ఖర్చుతో భద్రంగా, సౌకర్యంగా విశ్రాంతి తీసుకునేందుకు రిటైరింగ్ రూమ్స్ ప్రయాణికులకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.



