అంతర్యుద్ధం ముసుగులో ఇరాన్ రక్తపాతానికి వేదికగా మారింది. గత మూడు వారాలుగా కొనసాగుతున్న తీవ్ర ఘర్షణల్లో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతుండగా, లక్షలాది మంది గాయాలపాలవుతున్నారు. తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇప్పటివరకు దాదాపు 16,500 మందికిపైగా మరణించగా, 3.30 లక్షల మందికిపైగా గాయపడ్డారని అంచనా. ఈ సంఖ్యలు ఇంకా పెరిగే అవకాశముందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
డిసెంబర్ చివరి వారంలో మొదలైన ఈ అల్లర్లు క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాపించాయి. తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆంక్షల భారంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. కాల్పులు, అరెస్టులు, శిక్షలతో పరిస్థితిని నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలు మరింత రక్తపాతానికి దారి తీశాయి.
ఈ విషయాన్ని శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కూడా పరోక్షంగా ధృవీకరించారు. దేశంలో కొనసాగుతున్న ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన అంగీకరించారు. ఈ అల్లర్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని ఆరోపిస్తూ, ఆయనను ఖమేనీ తీవ్రంగా విమర్శించారు. అయితే మరణాల సంఖ్యపై అధికారిక గణాంకాలను ఇరాన్ ప్రభుత్వం వెల్లడించలేదు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం మృతుల సంఖ్య 16,500 నుంచి 18,000 మధ్య ఉండగా, గాయపడిన వారి సంఖ్య 3.30 లక్షల నుంచి 3.60 లక్షల వరకు ఉండవచ్చని చెబుతోంది.
ఈ ఘర్షణల్లో మహిళలు, పిల్లలు, గర్భిణులు కూడా పెద్ద సంఖ్యలో బాధితులుగా మారారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు యువతేనని నివేదికలు పేర్కొంటున్నాయి. అనేక సందర్భాల్లో ఆందోళనకారుల తలపై నేరుగా కాల్చడం వల్లే ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే 700 నుంచి 1,000 మంది వరకు కంటి చూపును కోల్పోయారని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
టెహ్రాన్‌లోని ప్రముఖ కంటి ఆస్పత్రిలో ఇటీవలే 7,000 మందికిపైగా కంటి గాయాలతో చికిత్స పొందినట్లు సమాచారం. నిరసనలను అణచేందుకు ప్రమాదకర ఆయుధాలను వినియోగించడం వల్ల కళ్లు, మెడ, ఛాతి వంటి కీలక అవయవాలకు తీవ్ర గాయాలు అవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారికి సరిపడా రక్త సరఫరా లేకపోవడం వల్ల కూడా వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. బాధితులను కాపాడేందుకు వైద్య సిబ్బందే స్వయంగా రక్తదానం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇరాన్‌లో కొనసాగుతున్న ఈ మారణహోమంపై అమెరికా సహా పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితిని తక్షణమే నియంత్రించి, పౌరుల ప్రాణాలను కాపాడాలని అంతర్జాతీయ సమాజం ఇరాన్ ప్రభుత్వాన్ని కోరుతోంది.



