ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా జీవితం ఊహించలేం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్ మెసేజ్‌లు అన్నీ క్షణాల్లో మన ఫోన్‌లోకి వచ్చేస్తున్నాయి. కానీ ఇవన్నీ గాలిలోనే వైర్‌లెస్‌గా వస్తున్నాయనుకుంటే మీరు తప్పులో ఉన్నట్టే.
నిజానికి మనం వాడే ఇంటర్నెట్‌లో దాదాపు 99 శాతం డేటా వైర్‌లెస్ కాదు. ప్రపంచ దేశాలను కలుపుతూ సముద్రాల అడుగున విస్తరించిన సబ్‌మరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారానే ఈ డేటా ప్రయాణిస్తుంది. అమెరికాలో అప్‌లోడ్ చేసిన వీడియో కూడా అదే కేబుల్స్ ద్వారా మన దేశానికి చేరుతుంది.
సముద్రం అడుగున డేటా హైవే
ఈ ఫైబర్ కేబుల్స్ వేల కిలోమీటర్ల పొడవుతో సముద్ర గర్భంలో ఉంటాయి. ఇవి డేటాను కాంతి సంకేతాల రూపంలో అతి వేగంగా మోసుకెళ్తాయి. అందుకే ప్రపంచం నలుమూలల సమాచారం క్షణాల్లో మనకు అందుతుంది.
టవర్ నుంచి ఫోన్ వరకే వైర్‌లెస్
డేటా ఒకసారి దేశానికి చేరుకున్నాక, ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా మొబైల్ టవర్లకు వెళ్తుంది. అక్కడ నుంచి మాత్రమే రేడియో తరంగాలుగా మారి మీ ఫోన్‌కు చేరుతుంది. అంటే నిజంగా వైర్‌లెస్ పనిచేసేది టవర్ నుంచి ఫోన్ వరకు మాత్రమే.
వైఫై కూడా కేబుల్ మీదే
ఇంట్లో వాడే వైఫై కూడా ఫైబర్ లేదా బ్రాడ్‌బ్యాండ్ కేబుల్ ద్వారానే రూటర్‌కి వస్తుంది. రూటర్ ఆ సిగ్నల్‌ను మాత్రమే వైర్‌లెస్‌గా పంపుతుంది. కేబుల్ కట్ అయితే వైఫై ఉన్నా ఇంటర్నెట్ ఉండదు.
4G, 5G లాంటి టెక్నాలజీలు వేర్వేరు ఫ్రీక్వెన్సీలపై పనిచేస్తాయి. ఫ్రీక్వెన్సీ పెరిగితే వేగం పెరుగుతుంది. టెక్నాలజీ ఎంత ఆధునికమైనా, ఇంటర్నెట్‌కు అసలైన వెన్నెముక మాత్రం ఈ ఫిజికల్ కేబుల్సే.



