Indian Railway Group D Jobs 2026: 10వ తరగతితో 22,000 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వే. పదో తరగతి అర్హతతోనే వేల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అరుదైన అవకాశాన్ని రైల్వే కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా యువతకు స్థిరమైన, గౌరవప్రదమైన ఉద్యోగాలు అందించాలనే లక్ష్యంతో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ డి విభాగంలో భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 22,000 పోస్టులను భర్తీ చేయనున్నారు.

రైల్వేలో ఉద్యోగం అంటే భద్రత, స్థిర ఆదాయం, కేంద్ర ప్రభుత్వ హోదా, అనేక రకాల అలవెన్సులు ఉంటాయి. అందుకే ప్రతి నోటిఫికేషన్‌కు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. ఈసారి కూడా అదే స్థాయిలో పోటీ ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దరఖాస్తుల తేదీలు

ఈ గ్రూప్ డి పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 జనవరి 20 నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 20, 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లై చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

నోటిఫికేషన్ వివరాలు

  • ప్రకటన సంఖ్య: CEN 09/2025
  • మొత్తం ఖాళీలు: సుమారు 22,000 (గ్రూప్ డి)
  • ప్రారంభ జీతం: నెలకు రూ.18,000 (ఇతర అలవెన్సులు అదనం)
  • ఉద్యోగ రకాలు: ట్రాక్ మెయింటెయినర్, పాయింట్స్‌మ్యాన్, సిగ్నల్ & టెలికాం అసిస్టెంట్, క్యారేజ్ & వ్యాగన్ అసిస్టెంట్ తదితర సాంకేతిక పనులు

పోస్టుల వారీగా ఖాళీలు

  • ట్రాక్ మెయింటెయినర్: 11,000
  • పాయింట్స్‌మ్యాన్ (బి): 5,000
  • సిగ్నల్ & టెలికాం అసిస్టెంట్ (S&T): 1,500
  • క్యారేజ్ & వ్యాగన్ అసిస్టెంట్ (C&W): 1,000
  • ఇతర సాంకేతిక పోస్టులు: 3,500

విద్యార్హత

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి

2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయోపరిమితి సడలింపు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, దివ్యాంగులు మరియు ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో తగిన సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

అభ్యర్థులను మూడు దశల ద్వారా ఎంపిక చేస్తారు.

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు.
  2. శారీరక దారుఢ్య పరీక్ష (PET): శారీరక సామర్థ్యం, పరుగు, బరువు మోయడం వంటి అంశాలు పరీక్షిస్తారు.
  3. సర్టిఫికేట్ వెరిఫికేషన్: చివరి దశలో అసలు పత్రాలను పరిశీలిస్తారు.

భాషా సౌకర్యం

రాత పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 13 భారతీయ భాషల్లో నిర్వహించబడుతుంది. ఇందులో తెలుగు, ఉర్దూ భాషలు కూడా ఉన్నాయి. అంటే తెలుగు విద్యార్థులు తమ మాతృభాషలోనే పరీక్ష రాయే అవకాశం ఉంటుంది.

ఎగ్జామ్ సెంటర్లు

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో అభ్యర్థులు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండదు.

దరఖాస్తు విధానం

ఆసక్తి ఉన్న అభ్యర్థులు rrbsecunderabad.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. పోస్టు ద్వారా లేదా ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను రైల్వే స్వీకరించదు.

చివరి రోజుల్లో వెబ్‌సైట్ సర్వర్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో, ఫిబ్రవరి 20కి ముందే దరఖాస్తు పూర్తి చేయడం ఉత్తమం. విద్యా సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు, ఫోటో, సంతకం వంటి పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి