కొన్నిసార్లు జీవితం ఊహించని చోట్ల ఆశ్చర్యకర మలుపులు తీసుకుంటుంది. అదృష్టం ఐదు నక్షత్రాల హోటల్‌లోనే కాదు… ఓ సాధారణ ఆటో రిక్షా వెనుక సీట్లో కూడా పలకరించవచ్చు అని నిరూపిస్తోంది ఈ నిజ జీవిత ప్రేమకథ. భారత్ పర్యటనకు వచ్చిన ఒక ఫ్రాన్స్ యువతి, జైపూర్‌లో జీవనం సాగిస్తున్న ఓ ఆటో డ్రైవర్… వీరిద్దరి ప్రపంచాలు వేరు, నేపథ్యాలు వేరు. కానీ వారి మనసులు మాత్రం ఒకే దారిలో కలిశాయి. మధ్యలో వీసా సమస్యలు, కుటుంబ వ్యతిరేకత, సామాజిక అడ్డంకులు ఎన్నో ఎదురైనా… చివరకు ప్రేమే విజయం సాధించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం… కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్‌కు చెందిన సారా అనే యువతి పర్యాటకంగా భారత్‌కు వచ్చింది. జైపూర్‌లో పర్యటన సమయంలో ఆమెకు ఒక స్థానిక ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. మొదట సాధారణ ప్రయాణికుడు–డ్రైవర్ సంబంధంగా మొదలైన ఈ పరిచయం, క్రమంగా స్నేహంగా మారి, చివరకు ప్రేమగా పరిణమించింది. భాష, సంస్కృతి, దేశాలు వేరైనా… వారి భావాలు మాత్రం ఒక్కటయ్యాయి. నేటి యుగంలో అరుదుగా కనిపించే స్వచ్ఛమైన ప్రేమకు ఈ కథ నిదర్శనంగా నిలుస్తోంది.
కేవలం రెండు వారాల పరిచయం… జీవితాన్నే మార్చేసింది
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో (@venom1s) వైరల్ అవుతున్న ఒక నిమిషం వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఆ వీడియోలోని వివరాల ప్రకారం… ఆ యువకుడు జైపూర్‌లో జీవనం సాగిస్తున్న ఒక సాధారణ ఆటో డ్రైవర్. సారా జైపూర్‌కి వచ్చిన సమయంలో అతని ఆటోలో ప్రయాణించింది. దాదాపు రెండు వారాల పాటు జైపూర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆమెను ఆటోలో తిప్పాడు. ఈ ప్రయాణాల మధ్య జరిగిన సంభాషణలు, పరస్పర గౌరవం, నమ్మకం వారి మధ్య బంధాన్ని మరింత బలపరిచాయి. అదే స్నేహం క్రమంగా ప్రేమగా మారి… సరిహద్దులు లేని అనుబంధానికి నాంది పలికింది.
కుటుంబ వ్యతిరేకత… వీసా ఇబ్బందులు… అయినా తగ్గని పట్టుదల
సారా తిరిగి యూరప్ వెళ్లిన తర్వాత, దూరంగా ఉండటం ఇద్దరికీ కష్టంగా మారింది. అయినప్పటికీ రోజూ గంటల తరబడి మాట్లాడుకుంటూ తమ బంధాన్ని నిలుపుకున్నారు. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. సారా కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ యువకుడు 10వ తరగతి పూర్తిచేయకపోవడం, ఆటో డ్రైవర్‌గా పని చేయడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారాయి. దీంతో అతనికి ఫ్రాన్స్ వీసా కూడా పలుమార్లు తిరస్కరణకు గురైంది. ఈ పరిస్థితులు వారి ప్రేమకు పెద్ద పరీక్షగా నిలిచాయి.
13 ఏళ్ల అనుబంధం… ప్రేమ గెలిచింది
ఎన్నో ప్రయత్నాలు, పోరాటాల తర్వాత చివరకు ఆ యువకుడు ఫ్రాన్స్ చేరుకోగలిగాడు. అక్కడ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. నేడు ఈ జంట దీపావళి, క్రిస్మస్ రెండింటినీ కలిసి జరుపుకుంటోంది.
“ఆమె నిన్ను వదిలేసి వెళ్లిపోతుంది అని చాలామంది చెప్పారు. కానీ 13 ఏళ్ల తర్వాత కూడా మేమిద్దరం కలిసి ఉన్నాం” అని ఆ యువకుడు గర్వంగా చెబుతున్నాడు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలతో కూడిన అందమైన కుటుంబం ఉంది.
జైపూర్ వీధుల్లో మొదలైన ఈ ప్రయాణం ఫ్రాన్స్ వరకు చేరింది. నిజమైన ప్రేమ ఉంటే మార్గాలు తానే వెతుక్కుంటాయని ఈ కథ మరోసారి రుజువు చేస్తోంది. ఇది కేవలం ఒక వైరల్ వీడియో మాత్రమే కాదు… నమ్మకం, ధైర్యం, ప్రేమ శక్తికి నిలువెత్తు ఉదాహరణ.



