చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు – తొలిసారి ప్రపంచకప్‌ విజేతగా భారత్‌

భారత మహిళల క్రికెట్ జట్టు కోట్లాది అభిమానుల కలను సాకారం చేసింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారిగా టైటిల్‌ గెలుచుకున్న ఘనతను సాధించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ పోరులో దక్షిణాఫ్రికాపై భారత్‌ 52 పరుగుల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది.

షఫాలీ దూకుడు – దీప్తి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

ఫైనల్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో భారత ఓపెనర్లు స్మృతి మంధన (45), షఫాలీ వర్మ (87) జట్టుకు గట్టి పునాది వేశారు. షఫాలీ తన స్వభావానికి తగ్గట్టుగా ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ కేవలం 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు సాధించింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం అందించింది.

తరువాత జెమీమా రోడ్రిగ్స్‌ (24), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (20) స్వల్పంగా మాత్రమే రాణించినా, దీప్తి శర్మ (58) చక్కటి ఇన్నింగ్స్‌ ఆడి జట్టును స్థిరపరిచింది. చివరి ఓవర్లలో వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ (34) బౌండరీలతో మెరుపులు మెరిపించడంతో భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో అయాబొంగా ఖాకా 3 వికెట్లు తీసింది.

వోల్వార్ట్‌ సెంచరీ వృథా

299 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఆరంభం నుంచే ఒత్తిడిని ఎదుర్కొంది. కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ (101) మాత్రం చివరివరకు పోరాడింది. 98 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో అద్భుత సెంచరీ నమోదు చేసినా, మిగతా బ్యాటర్ల నిరాశాజనక ప్రదర్శనతో ఆమె ప్రయత్నం వృథా అయింది. అనెరీ డెర్క్‌సెన్‌ (35) తప్ప మరెవరూ డబుల్‌ డిజిట్‌ స్కోరు అందుకోలేకపోయారు.

దీప్తి బౌలింగ్‌తో సఫారీ పతనం

భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బంతితో తన మాయాజాలాన్ని చూపింది. కీలకమైన లారా వోల్వార్ట్‌ వికెట్‌తో సహా మొత్తం 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ కూల్చేసింది. ఆమెకు తోడుగా షఫాలీ వర్మ 2 వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ సత్తా చాటింది. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్‌ అయింది.

భారత అమ్మాయిల ఘనత

52 పరుగుల తేడాతో భారత్‌ అద్భుత విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ కిరీటాన్ని గెలుచుకుంది. దీప్తి శర్మ తన అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో “మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌” అవార్డును దక్కించుకుంది. ఈ విజయం భారత మహిళల క్రికెట్‌ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోనుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి